చివరి శ్వాస వరకు సేవ చేస్తా:మంత్రి హరీష్ రావు

చివరి శ్వాస వరకు సేవ చేస్తా:మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, వెలుగు:  తన జీవితం సిద్దిపేట ప్రజలకు అంకితమని, చివరి శ్వాస వరకు సేవ చేస్తానని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు ప్రకటించారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి చీఫ్‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎన్నికలు వస్తున్నాయని  కాంగ్రెస్, బీజేపీ నేతలు తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.  కేసీఆర్‌‌ లేకుంటే తెలంగాణ  వచ్చేది కాదని,  సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో పాటు  ప్రాజక్టుల నిర్మాణం జరిగేది కాదన్నారు.  కాళేశ్వరంతో 56  లక్షల ఎకరాలకు నీరందుతుందని, ఢిల్లీ, గాంధీ భవన్ లో కూర్చొని కాళేశ్వరం దండగ అన్నోళ్లను గ్రామాలకు తీసుకొచ్చి కాలువలో ముంచితే పండగో.. దండగో.. తెలుస్తుందని చురకలంటించారు. తెలంగాణ ఏర్పడక ముందు సిద్దిపేట జిల్లాలో రూ. 30 కోట్ల  విలువైన  వడ్లు పండితే ప్రస్తుతం రూ. 300 కోట్ల వడ్లు పండుతున్నాయని చెప్పారు.  సీఎం కేసీఆర్‌‌ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోనే భూమి విలువ పెరిగిందన్నారు.  బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి తెరిచిన పుస్తకంలాంటిదని, సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదన్నారు.  రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన బీజేపీ ధరలు పెంచడం, ప్రభుత్వ సంస్థలు అమ్మడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.   బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూలగొడుతాం..  కాల్చుతామని అంటున్నారని, వాళ్లు పడగొట్టే పనులు చేస్తే సీఎం కేసీఆర్‌‌ నిలబెట్టే పనులు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐలను పంపడం, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను పడగొట్టడం మాత్రమే బీజేపీకి తెలుసని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మితో బాల్యవివాహాలకు బ్రేక్‌ పడిందన్నారు.  అర్బన్ మండలం సిద్దిపేటకు హైటెక్ సిటీలా మారిందని చెప్పారు.  ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల పంపిణీ

సిద్దిపేట నియోజకవర్గంలోని 72 మంది జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మంత్రి హరీశ్​ రావు పంపిణీ చేశారు.  రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో జర్నలిజం  ఛాలెంజింగ్‌తో కూడుకున్న వృత్తి అని, యాజమాన్యాల తీరుతో చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  జర్నలిస్టుల బాధలు దగ్గరగా  చూశానని, ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఇండ్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేట  ప్రెస్ క్లబ్ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని, వెల్ నెస్  సెంటర్‌‌లో ఎంబీబీఎస్ డాక్టర్‌‌ను నియమించనున్నట్టు ప్రకటించారు.  అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన  కార్యక్రమంలో 148 మందికి 58,59 జీవో పట్టాలు,  150 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను అందించారు.  బీజీ షెడ్యూల్ కారణంగా ఆలస్యంగా వచ్చానని దివ్యాంగులకు మంత్రి హరీశ్​ రావు సారీ చెప్పారు. అనంతరం యాసంగి ధాన్యం సేకరణపై  కలెక్టరేటగ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. టార్గెట్ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, టార్పాలిన్లు, కాంటాలు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.  రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రానివ్వొద్దని ఆదేశించారు.  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్‌‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, సతీశ్ కుమార్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత పాల్గొన్నారు.