పంపకాల పంచాయితీ!.. అంగీకరించని దళితులు

పంపకాల పంచాయితీ!.. అంగీకరించని దళితులు

మెదక్/శివ్వంపేట/కౌడిపల్లి, వెలుగు :  మెదక్​ జిల్లాలో దళిత బంధు పంపకాల పంచాయితీ నడుస్తోంది. దళితులందరికీ స్కీమ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గ్రామాలకు కొన్ని యూనిట్లు మాత్రమే మంజూరు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కో ఊరిలో 20 నుంచి 140 వరకు  దళిత కుటుంబాలు ఉండగా కొన్ని యూనిట్లే మంజూరయ్యాయి. దీంతో అధికారులు, అధికార పార్టీ నాయకులు గ్రామానికి మంజూరైన యూనిట్లనే  అందరూ కలిసి పంచుకోవాలని చెబుతున్నారు. దీన్ని చాలా చోట్ల దళితులు ఒప్పు కోవడం లేదు. ఊళ్లోని దళితులందరూ కలిసి పరస్పర అంగీకారంతో ఒప్పంద పత్రం రాసిస్తేనే యూనిట్లు గ్రౌండ్​ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. లేదంటే మళ్లీ దళిత బంధు యూనిట్లు మంజూరయ్యే వరకూ ఆగాలని సూచిస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. ​
    

  • శివ్వంపేట మండలానికి మొత్తం 120 దళిత బంధు యూనిట్లు మంజూరు కాగా పెద్ద గొట్టిముక్కుల, మగ్దుంపూర్,  కొంతాన్ పల్లి,  దంతాన్ పల్లి, గూడూర్,  చిన్న గొట్టిముక్కుల, ఉసిరిక పల్లి గ్రామాలలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులందరికీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గ్రామానికి 3 నుంచి  7 వరకు ఇవ్వాలని నిర్ణయించారు.  గ్రామ సభలు పెట్టి కొన్ని యూనిట్లు మాత్రమే మంజూరు అయ్యాయని, అందరూ అడ్జెస్ట్​ చేసుకోవాలని సూచిస్తున్నారు. 
  • చిన్న గొట్టిముక్కుల గ్రామంలో 140 కుటుంబాలు ఉండగా, కేవలం 7 యూనిట్లు మాత్రమే కేటాయించారు. గ్రామంలో ఉన్న దళితులందరూ కలిసి పంచుకోవాలని నాయకులు సర్ది చెబుతున్నారు.   
  • పెద్ద గొట్టిముక్కులలో 75 కుటుంబాలు ఉండగా 5  యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఆఫీసర్లు గ్రామసభ నిర్వహించగా కొందరికి ఇచ్చి తమ మధ్య  పంచాయతీ పెడతారా అని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ దళిత బంధు ఇప్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారని, తమందరికీ ఇవ్వాలని వారు ఆఫీసర్లకు తేల్చి చెప్పారు. 
  • దొంతి గ్రామంలో 262 దళిత కుటుంబాలు ఉండగా కేవలం 13 యూనిట్లు మాత్రమే మంజూరు అయ్యాయని, వాటిని ఎవరికి ఇవ్వాలో లబ్ధిదారులే నిర్ణయించుకోవాలని ఆఫీసర్లు చెప్పడంతో దళితులు మండిపడుతున్నారు.
  • ఉసిరికపల్లిలో 38 దళితుల కుటుంబాలు ఉండగా, కేవలం 3 యూనిట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. వాటిని కూడా అర్హులైన పేదలకు కాకుండా అనర్హులను సెలెక్ట్​ చేశారని గ్రామ దళితులు ఆరోపించారు. మిగతా 35 మంది తమకు తెలియకుండానే  గ్రామ సభ పెట్టారని నిరసన వ్యక్తం చేశారు. 
  •  కౌడిపల్లి మండల వ్యాప్తంగా 96 మందికి దళిత బంధు స్కీమ్ మంజూరు అయింది. కాగా ఆయా గ్రామాల్లో అర్హులైన వారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కొందరికి ఇస్తే మిగతా వారితో ఇబ్బంది కలుగుతుందని ఆఫీసర్లు తర్జనభర్జన పడుతున్నారు. 
  • కొల్చారం మండలంలోని వివిధ గ్రామాల్లో దళిత బంధు కొందరికే మంజూరు కాగా గ్రామంలో ఉన్న దళిత కుటుంబాల సంఖ్యను బట్టి ఐదు, పది మంది కలిసి పంచుకోవాలని సూచిస్తుండటంతో వివాదం కొనసాగుతోంది.     
  • అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలకు సైతం కేవలం కొందరికే దళిత బంధు మంజూరు కావడంతో ఇస్తే అందరికి ఇవ్వాలి.. లేకపోతే ఎవ్వరికీ ఇవ్వొద్దని తీర్మానించారు. ఈ విషయంలో కొన్ని గ్రామాల్లో ఆందోళనలు సైతం జరిగాయి. అన్ని గ్రామాల్లో స్కీం అమలు తీరు ఇలా ఉండటంతో  ప్రభుత్వ లక్ష్యం నీరుగారే పరిస్థితి నెలకొంది. 

సర్పంచ్​లకు తలనొప్పి

గ్రామాలకు దళిత బంధు యూనిట్లు కొన్ని మాత్రమే మంజూరు కావడం తమకు ఇబ్బందికరంగా మారిందని సర్పంచులు అంటున్నారు. ఊళ్లో చాలా మంది అర్హులు ఉండగా వారిలో నుంచి కొందరి పేర్లు సెలెక్ట్​ చేయడం తలనొప్పి వ్యవహారంలా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.