ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

సంగారెడ్డి: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లాలోని సదాశివ పేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ మాట తప్పే వ్యక్తి కాదని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పని చేస్తున్నారని చెప్పారు.  సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యమన్న ఆయన...  అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అవేకాకుండా కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు వంటి ఎన్నో పథకాలతో  పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నామని పేర్కొన్నారు.

తమది పేదల ప్రభుత్వం అన్న హరీశ్ రావు... బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తమలాంటి పథకాలు అమలు చేస్తున్నారా అని  ప్రశ్నించారు. రూ.45 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా సదాశివ పేటలోని ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందిస్తున్నామని తెలిపారు. సదాశివ పేటలో ప్రస్తుతం  రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి... రానున్న రోజుల్లో రూ.55 కోట్లతో మోరీలు, రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజ శ్రీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.