
కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని..అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రం కొనుగోలు చేయం అని అన్న.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. మెదక్ జడ్పీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ జిల్లా ధాన్యాగార బాండారంగా పేరుపొందిందని చెప్పారు. గతంలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ప్రస్తుతం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసంఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని.. దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్లు హరీష్ రావు తెలిపారు. సింగూరు నీళ్లను మెదక్, నిజామాబాద్ జిల్లాలకు అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం ద్వారా భవిష్యత్లో మరిన్ని ఫలితాలు పొందుతారన్నారు. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్ వేసిందని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలముందు ఉంచాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.
రైతుబీమా కింద 205 కోట్ల రూపాయలు చనిపోయిన రైతు కుటుంబాలకు అందించినట్లు చెప్పారు. విత్తన సాగు పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. పామాయిల్ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తే రైతుకు డబుల్ ఆదాయం వస్తుందని చెప్పారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ వడ్ల కొనుగోళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.