కరోనా లక్షణాలుంటే మెడిసిన్​ వేసుకుంటే చాలు

కరోనా లక్షణాలుంటే మెడిసిన్​ వేసుకుంటే చాలు

వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారందరినీ గుర్తించి మందులు అందజేస్తున్నామని, వారికి టెస్టులు అవసరం లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి పర్యటించారు. హరీశ్​రావు మాట్లాడుతూ రెండు టీకాలు తీసుకున్న వారికి కరోనా సోకడం లేదన్నారు. కేసీఆర్‌‌ కిట్‌తోనే ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు పెరిగాయన్నారు.  

స్టేట్ వైడ్​గా 12 పాలియేటివ్​ కేర్ ​సెంటర్లు
నాగర్​కర్నూల్​ : నాగర్​ కర్నూల్​జిల్లా దవాఖానాలో పాలియేటివ్​ కేర్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చివరిదశలో ఉన్నవారికి బాధ తెలియకుండా పాలియేటివ్​ కేర్​సెంటర్​లో  వైద్య సేవలందిస్తారన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరో 12 పాలియేటివ్​ సెంటర్స్​ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటిని సంజీవిని కేంద్రాలుగా మారుస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో  ప్రారంభించే ‘మన ఊరు మన బడి’లో భాగంగా అన్ని చోట్లా ఇంగ్లిష్​ మీడియం క్లాసులు ప్రారంభిస్తామన్నారు. కార్పొరేట్ ​కు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఫెసిలిటీస్​కల్పించేందుకు రూ.7,280 కోట్లు సమకూరుస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రతిపక్షాలు  జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. పేదలకు ఇంగ్లీష్​ మీడియం విద్యను అందిస్తామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని  విమర్శించారు. 

మరోవైపు జిల్లాలోని పెంట్లవెళ్లిలో మంత్రి కాన్వాయిని బీజేపీ, బీజేవైఎం లీడర్లు, కార్యకర్తలు అడ్డుకున్నారు. స్టేట్​లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్టు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, కొల్లాపూర్​ నియోజకవర్గానికి పాలిటెక్నిక్ ​కాలేజీ, పెద్దకొత్తపల్లి, చిన్నంబావి,పెంట్లవెల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. 20 నిమిషాల పాటు వెహికిల్​కు అడ్డం పడటంతో కాన్వాయ్​ నిలిచిపోయింది. దీంతో మంత్రి వేరే వాహనంలో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ లీడర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత వారిని పీఎస్​కు తరలించారు. మంత్రి వస్తున్నాడని జిల్లా కేంద్రంలో బీజేపీ లీడర్లను ముందుగానే  హౌస్​​అరెస్ట్​ చేశారు.