- ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పాన్గల్, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు సూచించారు. మంగళవారం పాన్గల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఎంపీడీవో కార్యాలయ సమీపంలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని, మాధవరావుపల్లి గ్రామంలో మూడు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించారు. పానగల్ నుంచి శాగాపూర్ మీదుగా కదిరేపాడు వరకు బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, ఆర్డీవో సుబ్రమణ్యం, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో గోవింద రావు, మాజీ జడ్పీటీసీ రవి, భాస్కర్ యాదవ్, నాయకులు మధుసూధన్ రెడ్డి, రాము యాదవ్, పుల్లారావు, బ్రహ్మం, సురేఖరాము యాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
