వనపర్తి, వెలుగు: రైతులను మిల్లుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వడ్లు కొన్న వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి రైతుకు రసీదు ఇవ్వాలని, ట్యాబ్ ఎంట్రీ చేయకుండా వడ్లు లారీల్లో ఎక్కించవద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు, ఏపీఎంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ, గత సీజన్లో ఇచ్చిన వడ్లను మిల్లింగ్ చేసి వెంటనే ఎఫ్ సీఐకి బియ్యం అప్పగించాలని, రైతులకు వడ్లు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు అందేలా చూడాలన్నారు. జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను మిల్లలుకు తరలించడానికి 350 లారీలు అవసరమని, కానీ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో లారీలు పెట్టకపోవడం, రైస్ మిల్లుల్లో వడ్లు వెంటనే దించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మిల్లుకు వచ్చిన వడ్లలో ఒక్క కిలో కూడా తరుగు తీయడానికి వీల్లేదన్నారు. ప్రతి సెంటర్‌కు ఒక ఆఫీసర్‌ను నియమించాలని, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమస్య ఎక్కడ వచ్చినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 2020–-21 నుంచి మిల్లర్లు రూ.400 కోట్ల సీఎంఆర్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని, వాటిని రికవరీ చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ మిగిలిన రాష్ట్రాల్లో మిల్లర్లు వంద శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారని, ఇక్కడ కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి ఇబ్బంది ఏముందని ప్రశ్నించారు.
వారం రోజుల నుంచి దొడ్డు వడ్లు తరలించడం లేదని రైతులు తన దృష్టికి తెచ్చారని, దొడ్డు వడ్లను వెంటనే తరలించాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, వనపర్తి, పెబ్బేరు ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్ గౌడ్, ప్రమోదిని, లైబ్రరీ చైర్మన్ గోవర్ధన్ సాగర్ పాల్గొన్నారు.
తేమ శాతం పేరుతో ఇబ్బంది పెట్టొద్దు
కొల్లాపూర్: తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మండలంలోని కుడికిల్ల, నార్లాపూర్, ఎల్లూరు గ్రామాల్లో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. సంబంధిత అధికారులు ప్రతి రోజు సెంటర్లను సందర్శించి వడ్ల కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
