
- ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్, వెలుగు: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. గురువారం నాగర్ కర్నూల్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురువులను సత్కరించడమంటే తమను తామే సత్కరించుకోవడమన్నారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు తరగతి గదుల నిర్మాణం, ఫర్నిచర్, పాఠ్య పుస్తకాలు అందించడంతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు.
ఉపాధ్యాయుల త్యాగం, కృషి వల్లే సమాజంలో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. స్టూడెంట్లకు మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయిలో ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులను శాలువా, పూలమాలతో సత్కరించి, మెమోంటోలు అందజేశారు. డీఈవో రమేశ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ రమణారావు, సెక్టోరియల్ అధికారులు నూరుద్దీన్, శోభారాణి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.