- మంత్రి జూపల్లి
మల్లేశ్వరం(నాగర్ కర్నూల్),వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణాతీరంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా పర్యాటకులను ఆకర్శించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, ఆయా గ్రామాల ప్రజల ఆదాయ వనరులు పెంచేందుకు కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
శనివారం సాయంత్రం పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపంలో కృష్ణానదిలో ఐలాండ్ అభివృద్ది, టూరిజం కాటేజీలు, పార్కులు, చిల్డ్రన్ ఎంటర్టైన్మెంట్, బోటింగ్ ఏర్పాటు కోసం రూ.48 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు పూజలు నిర్వహించారు. కృష్ణాతీరంలోని ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు.
సోమశిల,అమరగిరితో పాటు మల్లేశ్వరం ఐలాండ్‌ను డెవలప్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టుల ద్వారా మల్లేశ్వరం గ్రామంలో వసతి, అతిథ్య ఆదాయం పెరుగుతుందని , స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కృష్ణారావు అన్నారు. మల్లేశ్వరం గ్రామం నుంచి కృష్ణానదిలో ఐలాండ్ వరకు మరబోటులో ప్రయాణించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఐలాండ్ ప్రాంతాన్నీ పరిశీలించారు.
ఐలాండ్ లో టూరిజం కాటేజీలు, పర్యాటకులు సేదదీరేందుకు టూరిజం శాఖ అభివృద్ది చేస్తుందన్నారు. మల్లేశ్వరం గ్రామ ప్రజలకు ఉపాధి, ఉదోగ్య అవకాశాలు వస్తాయని, గ్రామంలో కొంత మంది కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. టూరిజం అభివృద్దితో సోమశిలలో స్థానికులకు ఆదాయం పెరిగిందన్న మంత్రి అమరగిరి, మల్లేశ్వరం ప్రాంతాలను ఇదే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు.
