కొల్లాపూర్, వెలుగు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ నిఖిల, కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణ నదిలో లక్ష చేప పిల్లలను వదిలారు. మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని 100 శాతం సబ్సిడీతో అమలు చేస్తోందన్నారు.
గతంలో వేరే దూరప్రాంతాల నుంచి చేప పిల్లల సప్లై చేయడంతో కొన్ని చనిపోయేవనిఇప్పుడు ఆ పరిస్థితి లేదని నాగర్ కర్నూల్ లో చేప పిల్లల తయారీ కేంద్రాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. మత్స్యకారులకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.
జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. అలీవి వలలతో మత్స్యకారుల జీవనోపాధికి నష్టం జరుగుతుందని, వాటిని పూర్తిగా అరికడతామన్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లే క్రూయిజ్ లాంచీని సందర్శించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని రెగ్యులర్ గా శ్రీశైలం కు లాంచీని నడిపేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహకు ఆదేశించారు.
