వితంతువుతో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేయించిన మంత్రి జూపల్లి

వితంతువుతో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేయించిన మంత్రి జూపల్లి


కొల్లాపూర్, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం మాచినేనిపల్లిలో ఆదివారం ఓ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు వితంతువుతో భూమిపూజ చేయించారు. గ్రామానికి చెందిన లక్ష్మీదేవమ్మ కుమారుడు రాముడి పేరుతో ఇల్లు మంజూరైంది. రాముడి భార్య గర్భిణి కావడంతో భూమి పూజలో పాల్గొనలేదు. దీంతో అతడి తల్లి లక్ష్మీదేవమ్మను పూజ చేయాలని మంత్రి జూపల్లి కోరారు.

 ఆమె వితంతువు అని స్థానికులు చెప్పడంతో.. మంత్రి వారికి నచ్చజెప్పి లక్ష్మీదేవమ్మతో పూజ చేయించారు. అనంతరం మాట్లాడుతూ... అమానవీయ ఆచారాలు, మూఢనమ్మకాలు కొనసాగించడం సరికాదన్నారు. వితంతువులను నిందించడం అంటే మహిళల పట్ల వివక్ష చూపించడమేనన్నారు. సమాజాన్ని చైతన్యపరచడానికి అందరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. వివక్ష, దురాచారాలు, మూఢనమ్మకాలను దూరం చేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.