నాసిరకం పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

నాసిరకం పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవు :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రోడ్ల నిర్మాణం, మరమ్మతుల్లో నిర్లక్ష్యం జరగొద్దని ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం సాగుతున్న పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా ప్రతి ప్రాజెక్టుకు సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించి మానిటర్ చేయాలని సూచించారు. శనివారం సెక్రటేరియెట్‌‌లో ఆర్ అండ్ బీపై ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్ రావు, సీఈ సతీశ్‌‌లతో ఆయన రివ్యూ నిర్వహించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని మాటిచ్చాం. 

గత ప్రభుత్వంలో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రమాదాల్లో చనిపోయేవారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా పనిచేయాలి” అని అధికారులకు సూచించారు. 15 స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా మార్చాలని వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను కలుస్తామని తెలిపారు. ఢిల్లీలో నిర్మించ తలపెట్టిన తెలంగాణ భవన్‌‌కు సంబంధించిన భూమి విషయం కొలిక్కి వచ్చిందని, ఆదివారం ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ల సమక్షంలో ఎంఓయూ చేసుకుంటున్నామని తెలిపారు.

బడా కాంట్రాక్టర్లకు వంతపాడిన గత సర్కారు 

పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బసంత్ నగర్ ఫ్లైఓవర్‌‌‌‌ను రెండు నెలల్లో పూర్తి చేసి, ప్రారంభించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి వెంకట్‌‌రెడ్డి ఆదేశించారు. ఎవరైనా నాసిరకం పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు వంతపాడి.. రోడ్డు మెయింటెనెన్స్ చూసే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, దీంతో రోడ్ల మెయింటెనెన్స్ లేక గుంతలు పడి ప్రజలు ప్రయాణించాలంటే భయపడే పరిస్థితికి వచ్చిందని విమర్శించారు. ‘‘నల్గొండలో నిర్మించతలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు. గత ప్రభుత్వంలో మాదిరి భూనిర్వాసితులకు ఇబ్బందులు కలగొద్దు. జాగ్రత్తలు తీసుకొని వారికి నష్టపరిహారం అందించేలా ప్యాకేజీ రూపొందించాలి. 

పట్టణానికి దూరంగా రింగ్ రోడ్డు నిర్మిస్తే ఉపయోగం ఉండదు. ప్రజలకు ఉపయోగపడేలా రింగురోడ్డు నిర్మాణ మాస్టర్ ప్లాన్ ఉండాలి” అని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ లో టిమ్స్ హాస్సిటల్స్, వరంగల్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. నల్గొండ, హైదరాబాద్‌‌లో పాత కలెక్టరేట్ల స్థానంలో కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఎంతమేరకు ఉందన్నది పరిశీలిస్తున్నామని.. అవసరాన్ని బట్టి కొత్త కలెక్టరేట్లను నిర్మిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో అఖిలపక్షంతో కలిసి వెళ్లి ఉస్మానియా దవాఖానను సందర్శించి.. చేపట్టాల్సిన చర్యలపై  నివేదిక తయారు చేసి సీఎంకు అందజేస్తామని తెలిపారు. రివ్యూ తర్వాత సీఎం రేవంత్‌‌ను కలిసి సమావేశ వివరాలను వెంకట్‌‌రెడ్డి వివరించారు.