
- వారం రోజుల్లో జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం
- ఎంజీ యూనివర్సిటీలో నూతన బిల్డింగ్స్ నిర్మిస్తాం
- క్యాంపు కార్యాలయానికి ఇందిరా భవన్ గా నామకరణం
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాను విద్యాహబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్రెసిడెన్షియల్ స్కూల్స్నిర్మిస్తున్నామన్నారు. నల్గొండలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాష్ట్రంలోనే మొదటిది కావాలన్నారు. 9 నెలల్లో ఈ స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ పట్టణ సమీపంలోని గంధంవారిగూడెంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి భూమిపూజ చేశారు.
అనంతరం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో రూ.13 కోట్లతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాల పక్కనే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉందన్నారు. భవిష్యత్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. విద్య, ఉపాధిలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు ఇందిరా భవన్ గా నామకరణం..
నల్గొండలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఇందిరా భవన్ అని పేరు నామకరణం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్లాక్ టవర్ సెంటర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామన్నారు. ఈ కార్యాలయం ఎమ్మెల్యే ఒక్కడిదే కాదని అందరిదని తెలిపారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు నల్గొండకు వచ్చినప్పుడు బస చేసేందుకు ఈ క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామని తెలిపారు. వచ్చే వారం రోజుల్లో జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు.
నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు..
నకిరేకల్ నియోజకవర్గంలో తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు రూ.20 కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నకిరేకల్ లో వంద పడకల ఆస్పత్రిని నవంబర్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రూ.1.20 కోట్లతో నిర్మించనున్న బ్రాహ్మణ వెల్లెంల గ్రామ పంచాయతీ భవనం దక్షిణ భారతదేశంలోనే ఆదర్శంగా ఉండేలా నిర్మిస్తామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో చింతపల్లి, నందిపాడు 2 బ్రిడ్జిలను హామ్ విధానంలో చేపడుతామని చెప్పారు.
జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వచ్చే క్యాబినెట్లో ఏ ఎంఆర్ సీ లైనింగ్ పనులకు జీవో వచ్చేలా చూస్తామని చెప్పారు. త్వరలో రూ.1000 కోట్లతో గంధమల్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. నల్గొండ పట్టణంలో లతీఫ్ సాబ్ దర్గా , బ్రహ్మంగారి మఠం పైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్ పనులు నడుస్తున్నాయని, రోప్ వే కూడా మంజూరైనట్లు తెలిపారు.
మూడేండ్లలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలి..
వచ్చే మూడేండ్లలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రిని కోరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గుర్రంపోడు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ మీదుగా గ్రీన్ ఫీల్డ్ రహదారి కార్నర్ నుంచి కాకుండా నల్గొండ మధ్యలోంచి వెళ్లేలా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఆఫీస్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.