
- విద్యా వైద్యానికి సర్కారు ప్రయారిటీ
నల్గొండ, వెలుగు: విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్గొండలో రూ.40 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ బిల్డింగ్కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందని, రూ.20 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తోందని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చాక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రూ.100 కోట్లతో బిల్డింగులు నిర్మించామని, ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇటీవల సీఎం కొత్తగా ఎల్ఎల్ఎం, ఎం ఫార్మసీ, కోర్సులు మంజూరు చేశారన్నారు. లా, ఫార్మసీ కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో విద్యను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నల్గొండ నర్సింగ్ కాలేజీలో రెండు రోజుల్లో ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, నెల రోజుల్లో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో బాత్రూంలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామనన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించినట్టు తెలిపారు.
నల్గొండ ఇంటిగ్రేటెడ్ స్కూలు రాష్ట్రానికే ఆదర్శం కావాలి
నల్గొండ రెసిడెన్షియల్ స్కూలు రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పనులపై కలెక్టరేట్లో రివ్యూ చేశారు.
నల్గొండలోని జివి గూడెం దగ్గర రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు ఈ నెల 4న భూమిపూజ చేశామని, 22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ స్కూలులో 9 హాస్టళ్లు, సిబ్బంది క్వార్టర్స్, 3000 మందికి ఒకేసారి భోజనాన్ని వండేలా వంటగది, 1280 మందికి సరిపడేలా డైనింగ్ హాల్ తో పాటు వాలీబాల్,షటిల్, ఫుట్బాల్ కోర్టులు, ఓపెన్ ఏయిర్ థియేటర్, ల్యాబ్లు, లైబ్రరీ తదితర వసతులు ఉంటాయన్నారు. స్కూలుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా సోలార్ ప్యానళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి క్వాలిటీతో స్కూలు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. రివ్యూలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలను కల్పిస్తాం
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చి.. సౌకర్యాలను కల్పిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈమేరకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రి నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
నల్గొండ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్న ఫిజీషియన్, సర్జన్ లతో పాటు ఇతర పోస్టులను భర్తీ చేస్తామని, బ్లడ్ బ్యాంక్ లో రిఫ్రిజిరేటర్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిచాలని సూచించారు. ప్రసవం తర్వాత తల్లికి,బిడ్డకు పనికి వచ్చేలా ఎంసీ హెచ్ కిట్లను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.