
- ఆర్డర్ కాపీలు అందజేసిన మంత్రి సురేఖ
- అర్చకులకు మెడికల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్
- ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆలయాల అర్చకులు, ఈవోల ప్రమోషన్లకు మంత్రి కొండా సురేఖ చొరవతో లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో అర్చకులు, ఈవోలకు మంత్రి సురేఖ ఆర్డర్ కాపీలను అందజేశారు. వివిధ దేవాలయాల్లో వేదపారాయణం చేసేవారికి గ్రేడ్-III నుంచి II, గ్రేడ్-II నుంచి I పోస్టులకు 16 మందిని ఎంపిక చేయగా.. వారికి ఉత్తర్వులు అందజేశారు. అనంతరం అర్చకులు, ఇతర సిబ్బంది నలుగురికి మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
ఈవో గ్రేడ్-III నుంచి ఈవో గ్రేడ్-II ఇద్దరు, మోఫిసిల్ సీనియర్ అసిస్టెంట్ నుంచి ఈవో గ్రేడ్-II ఒకటి, దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ నుంచి కన్వర్షన్ ఆఫ్ సర్వీసెస్ కింద ముగ్గురు అభ్యర్థులకు ఈవో గ్రేడ్-III గా మంత్రి ఉత్తర్వులను అందజేశారు. అసిస్టెంట్ కమిషనర్ కేటగిరీలో పదోన్నతులు పొందాల్సిన ఫీడర్ కేటగిరీలైన అయిన ఈవో గ్రేడ్-I, మోఫిసిల్ సూపరింటెండెంట్స్, ప్రముఖ దేవాలయాల్లోని ఏఈవోల సీనియారిటీలు వివిధ కారణాలతో ఆగిపోగా.. ప్రభుత్వం సమీక్షించేందకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎండోమెంట్లో పదోన్నతులను వేగంగా పరిష్కరించడానికి డిపార్ట్మెంట్ అధికారులతోపాటు జీఏడీలో అనుభవం ఉన్న విశ్రాంత ఉద్యోగులతో కమిటీ వేయాలని మంత్రి ఆదేశించారు.
దేవాదాయ శాఖలోని ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పదవీవిరమణ పొందిన అర్చక, ఇతర ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచడం, హౌసింగ్ లోన్ రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణాలు, ఇతర సౌకర్యాలు అర్చక సంక్షేమ నిధి ద్వారా లబ్ధి చేకూర్చేందుకు మంత్రి నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బంగారు గోపురంతోపాటు దేవాదాయశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మంత్రి డైరెక్టర్ వెంకటరావును అడిగి తెలుసుకున్నారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్చకులు, ఈవోల సమస్యలను పరిష్కరించిన మంత్రి కొండా సురేఖకు అర్చకులు కృతజత్ఞలు తెలిపారు.
కార్యక్రమంలో ఎండోమెంటు డైరెక్టర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఏడీసీ శ్రీనివాసరావు, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ వినోద్ కుమార్, కృష్ణప్రసాద్, వెంకటేశ్ పాల్గొన్నారుమట్టి గణపతుల పోస్టర్ రిలీజ్కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతి విగ్రహాల ప్రచార పోస్టర్‌లను శనివారం సెక్రటేరియెట్లో మంత్రి సురేఖ రిలీజ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి గణేశ్ విగ్రహాలను పూజించాలని, చెరువులు, కుంటలు, జలాశయాలకు హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. రిటెన్షన్ ట్యాంకుల నుంచి మట్టిని తీసుకొని గణేశ్ విగ్రహాలు తయారు చేసి అదే ట్యాంకుల్లో నిమజ్జనం చేయాలని, ఇది నీటి వనరులను కాపాడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీబీ కార్యదర్శి జి.రవి, చీఫ్ ఇంజినీర్ బి.రఘు తదితరులు పాల్గొన్నారు.