
- అలంపూర్ ఆలయానికి పూర్వ వైభవం తెస్తాం
- జోగులాంబ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
అలంపూర్, వెలుగు: రూ.401 కోట్లతో మూడు దశల్లో అలంపూర్ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను డెవలప్ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అలంపూర్ లోని జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు అమ్మవారి జ్ఞాపిక, వేద ఆశీర్వచనం అందించారు. జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి శాంతి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గద్వాల సంస్థానం వారసుడు కృష్ణ రాంభూపాల్ ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, టెంపుల్ ట్రస్టీగా ఆయన ఉంటారని తెలిపారు. జోగులాంబ ఆలయ కొత్త కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అలంపూర్ ఆలయాల సముదాయాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు మొదటి విడతలో రూ.32 కోట్లతో సుందరీకరణ పనులు. రెండో విడతలో రూ.24 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, మూడవ విడతలో రూ.345 కోట్లతో ఆలయాల అభివృద్ధి కోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఏపీలో ఉన్న ఆలయ భూములను టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఎలా వినియోగించాలనే విషయంపై చర్చిస్తామని చెప్పారు.