వరంగల్, వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి హనుమకొండ ఆర్‍అండ్ బీ గెస్ట్ హౌజ్‍లో గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్‍తో కలిసి జీడబ్ల్యూఎంసీ అధికారులతో రివ్యూ నిర్వహించారు.
కాగా, తూర్పు పరిధిలోని 24 డివిజన్లలో రూ.108 కోట్లతో 673 పనులు చేపట్టగా, రూ.25 కోట్ల విలువ చేసే 360 పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 69 పనులు పురోగతిలో ఉండగా.. 63 పనులు టెండర్ దశలో ఉన్నాయని, 53 పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశాయిపేట లక్ష్మీటౌన్ షిప్ రోడ్డులో కొత్త బ్రిడ్జి చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
శంభునిపేటలో స్లాటర్ హౌజ్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆర్డీవోను ఆదేశించారు. చెరువులు, కుంటలు ఆక్రమణ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ డివిజన్ పరిధిలో ఈఈ, డీఈ స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో లేనందును అభివృద్ధి పనులు ఆలస్యమైతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన మంత్రి వరంగల్ సర్కిల్‍కు రెగ్యూలర్ ఈఈని నియమించేలా చూడాలని కమిషనర్‍కు సూచించారు. సమావేశంలో బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, కుడా సీపీవో అజిత్‍రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
