
హనుమకొండ, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన సాగిస్తున్నామని అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సంబురాలకు మంత్రి చీఫ్గెస్ట్హాజరై జెండా ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా సత్కరించారు. జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 215 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను విజిట్చేశారు. అనంతరం వివిధ అంశాల్లో హనుమకొండ జిల్లా సాధించిన ప్రగతిని చదివి వినిపించారు.
హనుమకొండ జిల్లాలో రుణమాఫీలో 54,734 మంది రైతులకు 450.09 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రైతుబీమా కింద 333 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రూ.16.65కోట్లు అందజేశామన్నారు. పరకాలలో రూ.35 కోట్లతో వంద బెడ్ల ఆస్పత్రి నిర్మిస్తున్నామని చెప్పారు. హనుమకొండ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కుడా ఆధ్వర్యంలో 70 కోట్లతో భద్రకాళి ద్వీపాలకు రోప్ వే, సస్పెన్షన్ బ్రిడ్జీలు నిర్మిస్తున్నామన్నారు. వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ పథకం కింద 542.29 కోట్లతో 70 పనులు పూర్తయ్యాయని, మరో 38 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పరకాల మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడీసీ-2లో భాగంగా రూ.15 కోట్లతో 105 పనులు చేపడుతున్నామని తెలిపారు.
భూసమస్యల పరిష్కారానికి జిల్లాలో 302 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చామని, 163 మంది జీపీవోలను కూడా నియమిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 9,990 ఇందిరమ్మ ఇండ్లు మంజూ చేశామని, అందులో 21 ఇండ్లు పూర్తికాగా, మరో 5233 వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటిని రూ.24.85 కోట్లు బిల్లులు చెల్లించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.