తప్పని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. లేకుంటే నువ్వు చేస్తావా?

తప్పని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. లేకుంటే నువ్వు చేస్తావా?

మోడీ సర్కారు ప్రజలను దగా చేస్తోందని కేటీఆర్ అన్నారు. వడ్లు కొనం అంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని ఆయన చెప్పారు.  గద్వాల జిల్లాలో పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గద్వాల మార్కెట్ యార్డులో గద్వాల ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడారు. పైసలు కేంద్రానివి, రాష్ట్రానివి సోకులు అంటూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల చెమట, రక్తంతో కట్టిన పన్నులు దిక్కుమాలిన రాష్ట్రాల్లో వాడుకుంటున్నారో, లేదో వాళ్లు చెప్పాలని కేటీఆర్‌‌ అన్నారు. ఇది నిజం కాకపోతే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని, లేదంటే బండి సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. గద్వాల గడ్డపై నుంచి సవాల్ చేస్తున్నానని అన్నారాయన.

గడిచిన ఏడేండ్లలో రాష్ట్రం నుంచి 2 లక్షల 72 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కడితే, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది లక్ష 42 వేల కోట్లు మాత్రమేనని కేటీఆర్‌‌ అన్నారు.  కేంద్ర ప్రభుత్వమే డబ్బులిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలోని పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు మొత్తం గుండుసున్నా తప్ప ఏమి ఇవ్వలేదని, మన రాష్ట్రం నుంచి రూపాయి కడితే  కేంద్రం మనకు ఇస్తున్నది ఆటనా మాత్రమేనని అన్నారు. కేసీఆర్‌‌ను తిడితే టీవీలో, పేపర్‌‌లో వార్తలు రాస్తారని కొంతమంది కావాలని అవాకులు చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ అన్నారు.