నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్
  • కేంద్రం 46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘థ్యాంక్స్ టు తెలంగాణ’ అనే బోర్డులు పెట్టాలె
  • కేంద్రం అప్పులపై మంత్రి కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మోదీ ప్రధాని అయ్యాక దేశం అప్పులు రూ.100 లక్షల కోట్లు దాటాయని విమర్శించారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014 వరకు 14 మంది భారత ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పు చేస్తే... ఈ ఎనిమిదేండ్లలోనే ప్రస్తుత ప్రధాని మోదీ ఆ అప్పును రూ. 100 లక్షల కోట్లకు పెంచార‌ని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ లెక్కన ప్రతి భార‌తీయుడి మీద రూ. 1.25 లక్షల అప్పుంద‌ని తెలిపారు.

ఆర్ధిక విషయాలపై అనర్గళంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రం అప్పులపై మాట్లాడాలన్నారు. 2022లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అయితే... జాతీయ తలసరి ఆదాయం కేవలం రూ.1.49 లక్షలుగా ఉందన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీ కేవలం 23.5 శాతంగా ఉందని తెలిపారు. దేశ జనాభాలో 2.5 శాతంగా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో ఐదు శాతం వాటా కలిగి ఉందన్నారు. రాష్ట్ర పన్నుల ద్వారా కేంద్రానికి ఇస్తున్నప్రతి రూపాయిలో కేవలం 46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు. మిగిలిన డబ్బులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని, ఆ రాష్ట్రాల్లోని పీడీఎస్ షాపుల వద్ద ‘థ్యాంక్స్ టు తెలంగాణ’ అనే బోర్డులు పెట్టాలని డిమాండ్ చేశారు.