పల్లా మీటింగ్​కు.. కేటీఆర్ చెక్!

పల్లా మీటింగ్​కు.. కేటీఆర్ చెక్!

జనగామలో గ్రూపు రాజకీయాలపై బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ ఫోకస్​పెట్టారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి తీరు పార్టీకి నష్టం చేస్తుందని గుర్తించిన కేటీఆర్ శుక్రవారం ​చేసిన ఒక్క ఫోన్​కాల్​తో..  జనగామలో పల్లా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకర్తల సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్​లో అయోమయం నెలకొంది. సిట్టింగ్​ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉండగా.. కొన్ని నెలల క్రితమే జనగామ సీన్​లోకి ఎమ్మెల్సీ పల్లా ఎంటర్​అయ్యారు. గత నెల 21న 115 సీట్లకు బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​అభ్యర్థులను ప్రకటించినా, గ్రూపు తగాదాలతో జనగామను పెండింగ్​లో పెట్టారు. 

అప్పటి నుంచి పార్టీలో గ్రూపులు పెరిగాయి. జనగామ జెడ్పీ చైర్మన్​సహా పలువురు ప్రజాప్రతినిధులు పల్లా గ్రూపులో చేరారు. మరికొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ముత్తిరెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇద్దరు నేతలు హైదరాబాద్​తో పాటు జనగామలో పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం జనగామ శివారులోని ఒక ఫంక్షన్​హాల్​లో తన వర్గీయులతో పల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమాచారం అందుకున్న కేటీఆర్​ఎమ్మెల్సీకి ఫోన్​ చేసి జనగామకు వెళ్లొద్దని ఆదేశించారు. దీంతో పల్లా జనగామకు వెళ్లకుండా హైదరాబాద్​కు తిరిగి వచ్చేశారు. జనగామ అభ్యర్థిని పార్టీ ప్రకటించే వరకు ఎవరు రహస్య సమావేశాలు నిర్వహించొద్దని కేటీఆర్​ ఖరాఖండిగా చెప్పారు. 

పార్టీ లైన్​ను దాటితే ఉపేక్షించబోమని కూడా హెచ్చరించినట్టు తెలుస్తున్నది. జనగామపై కేటీఆర్​దృష్టి సారించడం, ఆయనకు అత్యంత సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి ఇక్కడ టికెట్​ఆశిస్తుండటం, తమకే చాన్స్​ ఇవ్వాలని ముత్తిరెడ్డి, పల్లా పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ నియోజకవర్గ టికెట్​ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.