గువ్వల బాలరాజును పరామర్శించిన మంత్రి కేటీఆర్

గువ్వల బాలరాజును పరామర్శించిన మంత్రి కేటీఆర్

అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి,  ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు.  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును ఆయన పరామర్శించారు.  తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు.  ఎన్నికల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు.  దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరే అని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అన్నారు .  శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పిన కేటీఆర్...  గువ్వల బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీని కోరుతున్నామని తెలిపారు.  ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలన్నారు కేటీఆర్. 

అచ్చంపేటలో నవంబర్ 12వ తేదీ శనివారం రోజున అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది.  బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే అనుమానంతో ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్‌ గేట్‌ వద్ద ఓ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. వాహనం ఆపకపోవడంతో దానిపై రాళ్ల దాడి చేశారు.  ఈ క్రమంలో ఇరువర్గాల  ఒకరిపై మరొకరు రాళ్లు వేసుకోగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న  పోలీసులు అక్కడికి చేరకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. 

విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,  కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడకి చేరుకోవడంతో  ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మె్ల్యే  గువ్వలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు.  వాహనంపై దాడి చేయడం సరికాదని బీఆర్ఎస్  కార్యకర్తలు అంటే.. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే  గువ్వల.