కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు మన బడి కార్యక్రమం : కేటీఆర్

కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు మన బడి కార్యక్రమం : కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అని మంత్రి కేటీఆర్ అన్నారు. గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ నుండి పీజీ వరకూ విద్యను రాష్ట్రంలో అందిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.  ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇప్పుడు మన మధ్య  లేకపోవడం బాధాకరమన్నారు. గంభీరావుపేటలో నిర్మించిన ఈ క్యాంపస్‌కు ఆయన పేరును పెడుతున్నామని కేటీఆర్ చెప్పారు.  

రాజకీయ ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాగాలేదని మంత్రి కేటీఆర్ చురకలంటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారు పనులు చేయరని అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద కార్యక్రమం కంటి వెలుగు అని చెప్పారు. సంక్షేమమే తమ ధ్యేయమని తెలిపారు.  వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య, పరిశ్రమలు ఏ రంగంలో అయిన ముందుకు దూసుకెళ్తున్నామని వివరించారు. 

గంభీరావుపేటలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ క్యాంపస్‌ రహేజా కార్ప్‌ ఫౌండేషన్‌, మైండ్‌స్పేస్‌ రిట్‌, యశోద హాస్పిటల్‌, ఎమ్మార్‌ఎఫ్‌, డీవీస్‌ ల్యాబ్‌, గివ్‌ తెలంగాణ, గ్రీన్‌కో సహకారంతో రూ.3 కోట్ల నిధులతో నిర్మించారు.