వెనుకబడిన రాష్ట్రాలను తెలంగాణే సాదుతోంది

వెనుకబడిన రాష్ట్రాలను తెలంగాణే సాదుతోంది

హైదరాబాద్: దేశంలో వెనుకబడిన రాష్ట్రాలను తెలంగాణనే సాదుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ఆర్బీఐ గణాంకాల ద్వారా స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. కేసీఆర్ సమర్థుడైనా నాయకుడు కాబట్టే అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ పైవ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లలో ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ఒక్కడిదేనని.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎవరూ ఇలా చేయలేదన్నారు. 

‘వరి ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో మా ఎంపీలు పేగులు తెగేదాకా కొట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ లు స్మగ్లర్లని ఓ బీజేపీ ఎంపీ అంటున్నారు. అసలు ఆయన మనిషా.. పశువా? రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాదు.. పీసీసీ చీప్. సెక్రటేరియట్ కింద నేలమాళిగలు ఉన్నాయట.. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ సొరంగం పెట్టి దోచుకున్నారట. వీళ్లకు చిప్ దొబ్బిందా? ఒకరు వేల కోట్ల స్కాం అంటారు.. ఇంకొకరు వ్యాక్సిన్ లతో 10 వేల కోట్ల స్కాం అంటారు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా?’ అని కేటీఆర్ క్వశ్చన్ చేశారు. 

‘తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడైనా కొట్లాడేది గులాబీ జెండానే. గుజరాత్, ఢిల్లీ గులాంలతో ఏమీ కాదు. అమిత్ షా, మోడీ ఊపులకు మేం బెదరం. యాసంగి కాలం మొదలైంది. వరి వెయ్యాలా, వద్దా ఇంకెప్పుడు చెబుతారు? కేంద్రం కొనం అని అంటేనే కదా మేం వరి వద్దంటున్నాం. తొండి సంజయ్ ఏమన్నడు.. వరి వేస్తే మెడలు వంచి కొనిపిస్తమన్నడు. మరేమైంది?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.