డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం:కేటీఆర్

డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం:కేటీఆర్

డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని డిఫెన్స్ కంపెనీలను కోరారు. ఢిల్లీలో CII, SIDM నిర్వహించిన డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశంలో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన కేటీఆర్.. తెలంగాణలోని డిఫెన్స్ రంగ పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను వివరించారు. 

రాష్ట్రంలో డిఫెన్స్ ఈకో  సిస్టం భారీగా విస్తరించింది

దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఈకో సిస్టం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, గత ఏడేండ్లలో ఇక్కడి డిఫెన్స్ ఈకో  సిస్టం భారీగా విస్తరించిందని కేటీఆర్ అన్నారు. డిఫెన్స్,ఏరోస్పేస్ రంగంలో స్థానికంగా సుమారు 1000కి పైగా MSME సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో ఉన్న డిఫెన్స్ పరిశోధన, అభివృద్ధి రంగం అత్యంత కీలకమైనదన్నారు.ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియా గా పేరు ఉన్నదనన్నారు. ఇక్కడే డీఆర్ డీవో, బెల్, హాల్ వంటి అనేక రక్షణ రంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయన్నారు. 

ప్రముఖ కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాయి

ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అనేక ఇతర దేశాలకు చెందిన ప్రముఖ OEM ( ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్) కంపెనీలు ఒకేచోట  భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం ప్రపంచంలో ఎక్కడా లేదని కేటీఆర్ తెలిపారు. ప్రఖ్యాత డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ సంస్థలైన లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జిఈ, సాఫ్రాన్ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాదులో నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 

హైదరాబాద్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు

తెలంగాణ ప్రభుత్వం స్పేస్, డిఫెన్స్ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించినదని తెలిపారు. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు సాధించేందుకు అవసరమైన పరిపాలనపరమైన సంస్కరణలను చేపట్టామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ TSI PASS విధానం, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కోతలులేని 24 గంటల పారిశ్రామిక విద్యుత్తు సదుపాయం వంటి అంశాలను తమ పెట్టుబడి ప్రణాళికల్లో పరిగణలోకి తీసుకోవాలని డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ప్రైవేట్ సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీంతోపాటు ప్రపంచ స్థాయి క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి వాటితో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ వలన హైదరాబాద్ లో ఇన్నోవేషన్ ఈకో సిస్టం బలంగా ఉన్నదని కేటీఆర్ తెలిపారు. 

తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్కులు 

బోయింగ్ కంపెనీ ఇన్నోవేషన్ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  IDEX వంటి ఇంకుబేషన్ కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిభట్ల, నాదర్గుల్, జిఎంఆర్ ఏరోస్పేస్, హార్డ్వేర్ పార్క్, ఈ-సిటీ, ఇబ్రహీంపట్నంలో టీఎస్ ఐఐసి ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్క్ వంటి ప్రత్యేకమైన ఏరోస్పేస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్కులు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తమ పెట్టుబడులతో రావాలని డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్  విజ్ఞప్తి చేశారు. తెలంగాణకి వచ్చే పెట్టుబడి సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించి అండగా ఉంటుందని తెలిపారు.

ఢిల్లీలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఓ ఎస్ డి గా ఉన్న సీనియర్ అధికారి సంజయ్ జాజు, తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఏరో స్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.