జైలుకు ఎవరు పోతారో చూద్దాం

జైలుకు ఎవరు పోతారో చూద్దాం

జైలుకు ఎవరో పోతారో చూద్దామంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు రేవంత్ ఆరోపణలు చేశాడని.. అతడిని జైలుకు పంపిస్తానన్నారు. రేవంత్ పై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్ తో తాను చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పారు. తనకు సీటు రాకుండా.. ఎన్నో కుట్రలు పన్నాడన్నారు. మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిదే. దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 2022, మే 24వ తేదీ మంగళవారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. 15 సంవత్సరాల నుంచి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎలా పీసీసీ అధ్యక్షులు అయ్యారని సూటిగా ప్రశ్నించారు.

తాను ఇచ్చిన డబ్బులతోనే రేవంత్ బిడ్డ పెళ్లి చేసినట్లు, ఈ విషయంలో యాదగిరిగుట్ట స్వామిపై ఒట్టు వేయాలని సవాల్ విసిరారు. రేవంత్ ఓ దొంగ... పైసలియ్యకపోతే కాలేజీలు మూయించి వేస్తానని బెదిరించినట్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని ఎద్దేవా చేశారు. రేవంత్ కింద అనుచరులు ఉంటారని, ఆయన ఎక్కడకు వెళ్లినా.. నినాదాలతో హోరెత్తిస్తారని వెల్లడించారు. సొంత పార్టీలోనూ సీనియర్లను ఉండనివ్వడని, రేవంత్ రెడ్డి చేపడుతున్న రైతు రచ్చబండ కాదు.. అది బట్టేబాజ్ బండ తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

తెలంగాణ కోసం పార్లమెంట్ లో ఏమి మాట్లాడలేదని తాను ఎంపీగా ఉన్న సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడిగానో రికార్డులు చూస్తే తెలిసిపోతుందన్నారు.  రేవంత్ త్వరలోనే బీజేపీలోకి వెళ్లిపోతాడని జోస్యం చెప్పారు. 1200 గ్రామాలకు మంచినీటితో పాటు.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. జాతీయ రాజకీయాలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ దేశ్ కి నేత అవుతారన్నారు. తన కాలేజీల్లో ఎంతో మంది చదువుతున్నారని, ఇంజినీర్లు, డాక్టర్లు తయారవుతున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.