మరోసారి అవకాశం ఇవ్వండి : నిరంజన్ రెడ్డి

మరోసారి అవకాశం ఇవ్వండి : నిరంజన్ రెడ్డి
  • సీఎంఆర్ఎఫ్​ చెక్కుల పంపిణీలో వనపర్తిదే ఫస్ట్  ప్లేస్ 

వనపర్తి, వెలుగు : నిధులు, నీళ్లు సాధించడంలో రాష్ట్రంలోనే వనపర్తిది మొదటి స్థానమని, ఐదేండ్లలో జరిగిన అభివృద్ధి మరెక్కడా జరగలేదని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఐదేండ్లలో ఏడు వేలకు పైగా సీఎంఆర్ఎఫ్​ చెక్కులను బాధితులకు అందించామని చెప్పారు. మన బతుకులు మార్చే ఎన్నికలని, ఆలోచించి మరోసారి బీఆర్ఎస్  పార్టీని గెలిపించాలని కోరారు.

వనపర్తికి సాగు నీరు తరలించేందుకు తాను పక్క జిల్లాల నేతలతో గొడవపడ్డానని చెప్పారు. మూడు నెలలుగా వర్షాలు లేకపోయినా రైతులకు ఇబ్బందులు లేకుండా గొలుసు కుట్టు చెరువులు నింపుకుని పంటలు పండించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. వనపర్తి పట్టణంలో తాగునీటి సప్లైలో ఇబ్బందులు తొలగించి ప్రతి రోజూ ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామన్నారు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేసి అందరికంటే ముందుగా కొత్త కలెక్టరేట్ భవనాలు ప్రారంభించారమని చెప్పారు.

రాష్ట్రంలో కేసీఆర్ ను, వనపర్తిలో నిరంజన్ రెడ్డిని తిడితే ఓట్లు పడవని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. చిత్తశుద్ధితో పని చేసే వారికి ఓటు వేయాలని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఓటర్ల ను మభ్య పెట్టే వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. శ్రీరంగాపూర్ మండలంలోని తాటిపాముల, కంబలాపూర్ తండా, నాగరాల, నాగసానిపల్లి, వెంకటాపూర్, జానంపేట, శేరుపల్లి, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరారు.