ఇండ్లు కట్టిస్తే కమీషన్లు రావనే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన్రు : మంత్రి పొంగులేటి

ఇండ్లు కట్టిస్తే కమీషన్లు రావనే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన్రు : మంత్రి పొంగులేటి
  • బీఆర్ఎస్​ను అసహ్యించుకుంటున్నా సర్కారుపై విమర్శలు చేస్తున్నరు: మంత్రి పొంగులేటి
  • పైసా కమీషన్ లేకుండా పేదోడి సొంతింటి కల నెరవేరుస్తం  డ్లు పంపిణీ
  • స్లమ్ ఏరియాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తమని వెల్లడి
  • హనుమకొండలో డబుల్ బెడ్రూం ఇం

హనుమకొండ/వరంగల్, వెలుగు: పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తే కమీషన్లు రావనే.. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో అందరూ చూశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ ను అసహ్యించుకుంటున్నా.. నిస్సిగ్గుగా అధికార పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బాలసముద్రం అంబేద్కర్ నగర్ లో గత ప్రభుత్వం నిర్మించి, ఏడేండ్లుగా పడావు పెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం మంత్రి పొంగులేటి ప్రారంభించారు.

 కొబ్బరికాయలు కొట్టి, రిబ్బన్ కట్ చేసి పలువురు లబ్ధిదారుల ఇండ్లలో పాలుపొంగించారు. అనంతరం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో 341 మంది లబ్ధిదారులకు ఇండ్ల అలాట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వాళ్లు చాలామందే ఉన్నారని, ఒక్క పైసా కూడా కమీషన్ లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 

రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తో పాటు అన్ని పట్టణాల్లోని స్లమ్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని.. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, ఈ శ్రావణమాసంలోనే అనేక చోట్ల గృహ ప్రవేశాలు జరగబోతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఏడాదికిన్ని ఇండ్లు కట్టినా.. ఇప్పుడు ఇండ్లు అడిగే పరిస్థితి ఎవరికీ ఉండేది కాదన్నారు. 

నెత్తిన అప్పున్నా.. రైతులకు భద్రత

గత ప్రభుత్వం 8.19 లక్షల కోట్ల అప్పును రాష్ట్రం నెత్తిమీద పెట్టినా.. గడిచిన 18 నెలల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. నాటి ప్రభుత్వం వరి వేస్తే ఉరే అని రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతుకు భద్రత కల్పించేలా మద్దతు ధర, రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేపట్టి, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని పదేండ్లు ఏలిన బీఆర్ఎస్ పార్టీ రెండూ తోడుదొంగలై.. ఆ బిల్లును రాకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

వరంగల్ లో గత ప్రభుత్వం ఇండ్ల పేరుతో ఓట్ల రాజకీయం చేసిందని, అంబేద్కర్ నగర్ ఇండ్ల పేరు చెప్పి 2,500 మంది వద్ద అందిన కాడికి దండుకున్నారన్నారు. అందుకే ఆరేండ్లయినా పేదలకు ఇండ్లు ఇవ్వలేకపోయిందని చెప్పుకొచ్చారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఓట్ల కోసం చూడకుండా పారదర్శకంగా ఇండ్లు పంపిణీ చేశారన్నారు. గత పాలకులు ఎంపిక చేసిన ప్రభుత్వ ఉద్యోగులను జాబితాలోంచి తొలగించామని, అందులో ఉన్న అర్హులతో పాటు కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా మొత్తంగా 592 మంది లబ్ధిదారులను ఫైనల్ చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.