స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు జీరోనే : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు జీరోనే : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో జిల్లా ప్రజలు బీఆర్​ఎస్​కు తగిన బుద్ధి చెప్పారని, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్​కు గుండు సున్నాయేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. కొత్తగూడెం క్లబ్​లో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల ప్రొసీడింగ్స్అందజేశారు. వీకే ఓసీ భూ నిర్వాసితులు 48 మందికి భూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4.50లక్షల ఇండ్ల నిర్మాణాలను ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 

ప్రతీ పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామని చెప్పారు. ప్రజల హక్కులను ఏపీకి తాకట్టు పెట్టింది బీఆర్​ఎస్​ పాలకులేనని విమర్శించారు. పదేండ్లలో గోదావరి నీళ్లను ఏపీకి ఇచ్చేలా కుట్రలు జరిగాయన్నారు. ప్రభుతం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించారు. పథకాల అమలును ఓర్చుకోలేని బీఆర్​ఎస్​ నేతలు విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రోగ్రాంలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఐడీసీ చైర్మన్​ మువ్వా విజయ్​ బాబు, కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్​ తో పాటు పలువురు అధికారులు నేతలు పాల్గొన్నారు.   

వర్క్​ బుక్స్​ ఆవిష్కరణ 

భద్రాచలం  : భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో చదివే 1 నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఉద్దీపకం-2 వర్క్ బుక్స్ ను తయారు చేయగా వాటిని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి పీవో బి.రాహుల్​ పాల్వంచలో ఆవిష్కరించారు. 

పాల్వంచ : అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మున్సిపల్ కాంట్రాక్టర్ పైడిపల్లి మనోహర్ రావు కుటుంబాన్ని మంత్రి పొంగులేటి పరామర్శించారు.

ప్రజలకు అండగా ప్రభుత్వం

కామేపల్లి :  మండలంలోని తాళ్లగూడెం గ్రామానికి చెందిన టీపీసీసీ మెంబర్, కామేపల్లి సొసైటీ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం యాదవ్, పుచ్చకాయల వీరనారాయణ యాదవ్  తల్లి అచ్చమ్మ  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారిని మంత్రి పొంగులేటి, ఎంపీ రహురాంరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్లు మేకల మల్లిబాబు యాదవ్, బొర్రా రాజశేఖర్  పరామర్శించారు. గత పదేండ్లలో తెలంగాణను బీఆర్ఎస్ పాలకులు దోపిడీకి గురిచేశారని,  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం  పునర్ నిర్మిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకున్నవారిని వదిలిపెట్టబోమని స్పష్ట చేశారు.