బీసీ రిజర్వేషన్లు చారిత్రాత్మకం: మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

బీసీ రిజర్వేషన్లు చారిత్రాత్మకం: మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

హుస్నాబాద్, వెలుగు: ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ అన్నారు. చట్ట, న్యాయపరమైన అంశాలను పరిశీలించాకే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవో ఇచ్చామని గుర్తుచేశారు. హుస్నాబాద్‌‌‌‌లోని క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ‘రిజర్వేషన్లకు సంబంధించి ఇంతకన్నా మెరుగైన మార్గం చెప్పాలి.. లేదంటే షెడ్యూల్‌‌‌‌ 9లో చేర్చాలి’ అని కేంద్రాన్ని డిమాండ్‌‌‌‌ చేశారు. బీసీల నోటి కాడి ముద్దను చెడగొట్టేలా కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, ఇప్పుడు అఫిడవిట్ల రూపంలో కోర్టుకు కూడా సమర్పించాలని సూచించారు. రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగంలో ఉన్న మాదిరిగానే అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ రిజర్వేషన్ల కారణంగా బలహీనవర్గాలకు 55 వేల పదవులు దక్కే అవకాశం ఉందన్నారు. 

మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ లింగమూర్తి, సింగిల్‌‌‌‌ విండో చైర్మన్‌‌‌‌ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్‌‌‌‌ కంది తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో శమీ, ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొని విల్లు ఎక్కిపెట్టి రావణ దహనం చేశారు.