ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌తో ఓటమి భయం పట్టుకున్నది: మంత్రి పొన్నం

ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌తో ఓటమి భయం పట్టుకున్నది: మంత్రి పొన్నం

 కరీంనగర్, వెలుగు: పదేండ్లలో ప్రధానిగా దేశానికి చేసిన పని గురించి చెప్పుకునే పరిస్థితిలో మోదీ లేరని, అందుకే మత విద్వేషాలు రెచ్చగొట్టి మెజారిటీ హిందువుల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మోదీ మాటలు వింటే.. దేశమే సిగ్గుపడే పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు పంచేస్తారంటూ మోదీ చేసిన కామెంట్లను ఖండిస్తున్నామన్నారు. ప్రధాని హోదాలో ఇలా మాట్లాడటం సరికాదని, పదేండ్లలో 85 శాతం హిందువులకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కరీంనగర్​లో వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమానికి పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లు పూర్తికాగానే మోదీకి ఓటమి భయం పట్టుకున్నది. అందుకే మత విద్వేషాలు రెచ్చగొడ్తున్నరు. పదేండ్లలో దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. తెలంగాణ విభజనను వ్యతిరేకించారు. అమరవీరులను అవమానించారు. 

రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి? పదేండ్లలో తెలంగాణ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఏడు మండలాలతో పాటు సీలేరు ప్రాజెక్ట్​ను ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకుపోయిన్రు’’అని మండిపడ్డారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నియంత మోదీ అయితే.. తమ అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ అని పొన్నం అన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ వరంగల్ నుంచి కరీంనగర్​కు వచ్చిన వలస పక్షి అని వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు.

 కాంగ్రెస్ ను గెలిపిస్తే కరీంనగర్​ను కోహినూర్​లా మార్చుకుందామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జ్ వొడితల ప్రణవ్, సిరిసిల్ల ఇన్ చార్జ్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పురుమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.