ఖమ్మం టౌన్, వెలుగు : ‘నా వెహికిల్ ను ఇంతవరకు తహసీల్దార్, మైనింగ్ ఆఫీసర్లే అడ్డుకోలే. నీకెంత ధైర్యం ఉంటే నా వాహనం తీసుకొస్తవ్. నేనెవరనుకున్నావురా...మంత్రి అజయ్ కుమార్ పీఏ రవికిరణ్ బాబాయ్ కొడుకునురా? అంటూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి బీట్ లో ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి చేశాడో వ్యక్తి. బాధిత ఫారెస్ట్ ఆఫీసర్ల కథనం ప్రకారం..చింతగుర్తి బీట్పరిధిలోని ఫారెస్ట్ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వి తీసుకెళ్తున్నారని తెలియడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు శ్రీనివాస్, రవి జేసీబీని ఆపారు. ఫారెస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండగా వాటి ఓనర్ అయిన జాలాది రామారావు పది మందిని వెంటేసుకుని వచ్చి అటకాయించాడు. ‘నేను ఎక్కడ తవ్వకాలు చేసినా నన్ను అడ్డుకున్నవాడు లేడు. మీకెంత దమ్ముంటే ఇలా చేస్తారు. నేను మంత్రి పీఏ బాబాయ్ కొడుకునని తెలిసే చేస్తున్నారా? ’ అంటూ ఆఫీసర్లపై పిడిగుద్దులు కురిపించాడు. వారి సెల్ఫోన్లు, పవర్ బ్యాంక్ పగలగొట్టాడు. తర్వాత జేసీబీని తీసుకొని ‘నీ దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ వెళ్లిపోయాడు. ఈ విషయమై ఆఫీసర్లు రఘునాథపాలెం పీఎస్లో కంప్లయింట్ చేయగా ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ , తమిళనాడు రాష్ట్ర పార్టీ జాతీయ కో కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం గురించి సీపీకి ఫోన్ చేసి చెప్పాననన్నారు. దాడి గురించి ఎస్సీ, ఎస్టీ కమీషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
