పోలీసులను జీపుల ముందు పరిగెత్తిస్తామనడం సిగ్గు చేటు: పువ్వాడ అజయ్ కుమార్

పోలీసులను జీపుల ముందు పరిగెత్తిస్తామనడం సిగ్గు చేటు: పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు: తనను ఖాసిం రజ్వీతో పోల్చడం హాస్యాస్పందంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం సిటీ నెహ్రూ నగర్​లోని లాయర్​మల్లాది వాసుదేవరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఖమ్మం అభివృద్ధికి, ఓ పెద్ద మనిషి అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ మాట తూలలేదని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోలీసులను జీపుల ముందు పరిగెత్తిస్తానంటూ ఓ నేత మాట్లాడటం సిగ్గు చేటన్నారు. అప్పుడే అధికారం వచ్చేసినట్లు భావించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​లో దర్జాగా పదవులు అనుభవించి, ఇప్పుడు నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడగలుగుతున్నారని ప్రశ్నించారు. పాలేరు టికెట్ ఇస్తే మంచి ప్రభుత్వం, ఇవ్వకుంటే నిరంకుశ ప్రభుత్వమా అని ధ్వజమెత్తారు.

ALS0 READ: కేసీఆర్​ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు : కూచాడి శ్రీహరి రావు

గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతా అన్న పెద్ద మనుషి, ఖమ్మం ప్రజల కాళ్లతో ఏం పనో చెప్పాలన్నారు. అనంతరం ఖమ్మం పార్టీ ఆఫీసులో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీల సమావేశంలో అజయ్ పాల్గొన్నారు. తన దగ్గర ఉన్న వాళ్లంతా రౌడీలు, దొంగలు అంటూ ప్రత్యర్థులు మాట్లాడడంపై మండిపడ్డారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ సర్వే తీసుకున్నా బీఆర్ఎస్సే గెలుస్తుందని చెబుతున్నారన్నారు. ప్రముఖ డాక్టర్​ మధన్ సింగ్ ను పువ్వాడ అజయ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు.