యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ తో మంత్రి సబిత చర్చలు

యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ తో మంత్రి సబిత చర్చలు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో దాదాపు 45 నిమిషాల పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై చర్చించారు. బిల్లుపై తమకు ఉన్న అనుమానాలను గవర్నర్ తమిళిసై మంత్రి సబితను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యూజీసీ నిబంధనలు, న్యాయపరమైన అంశాలను ప్రస్తావించారు. అన్నింటిని పూర్తిస్థాయిలో పాటిస్తున్నామని, భవిష్యత్తుల్లోనూ ఎటువంటి ఇబ్బందులు ఉండవని గవర్నర్ కు తెలిపారు. ప్రస్తుత విధానంలోని ఇబ్బందులు, కొత్త విధానం ద్వారా జరిగే లాభాన్ని కూడా గవర్నర్ కు వివరించారు.

యూనివర్సిటీలలో నియామాకాలు త్వరగా జరగాలన్నదే తమ అభిమతమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ భేటీలో గవర్నర్ అడిగిన అన్ని సందేహాలను మంత్రి సబితతో పాటు విద్యాశాఖ అధికారులు నివృత్తి చేశారు. ఈ సమవేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, టెక్నికల్ ఎడ్యూకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నారు.

కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై సందేహాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యూజీసీకీ లేఖ రాశారు. తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు 2022బిల్లుపై చర్చించేందుకు రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాశారు.