రైతులు వలసబాట పట్టకుండా ఉపాధి కల్పిస్తాం : మంత్రి సీతక్క

రైతులు వలసబాట పట్టకుండా ఉపాధి కల్పిస్తాం : మంత్రి సీతక్క
  • రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖమంత్రి సీతక్క
  • 135 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

అలంపూర్/శాంతినగర్/అయిజ, వెలుగు : ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో రైతులు వలసబాట పట్టకుండా వీబీ జీరాంజీ ద్వారా పెత్త ఎత్తున ఉపాధి కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అలంపూర్​ నియోజకవర్గ పరిధిలో రూ. 135 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రి సీతక్క శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఇందులో ఐజ మండలం చిన్న తాండ్రపాడు నుంచి పెద్ద ధన్వాడ వరకు, వేణి సోంపురం వయా సిటీపాడు వరకు, ఉండవెల్లి మండలం కంచుపాడు నుంచి హైవే44 వరకు, రాజోలి మండలం పచ్చర్ల నుంచి పెద్ద తాండ్రపాడు వరకు నిర్మించనున్న రోడ్డు పనులు ఉన్నాయి. 

అలంపూరు నియోజకవర్గంలో వీబీ జీరాంజీ స్కీంలో భాగంగా రూ. 30.22 కోట్లతో చేపట్టే 323 పనులకు శంకుస్థాపన చేశారు. చిన్న తాండ్రపాడులో సామాజికవేత్త ఆనందరావు విగ్రహాన్ని, గ్రామానికి చెందిన స్వాతంత్ర సమర యోధులు కరణం సీతారామారావు, కరణం సుబ్బారావు, పెద్ద సుంకన్న గౌడ్ ఫొటోలతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసి, ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. 

కార్యక్రమాల్లో సీతక్కతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీతక్క మాట్లాడుతూ కొత్త పెన్షన్లు రాని వారికి మరో విడత మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజికవేత్త ఆనందరావును స్ఫూర్తిగా తీసుకొని సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఆనందరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంపత్ కుమార్ ను, వారి కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఆనందరావులాంటి వారిని ఆదర్శంగా తీసుకొని గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. 

అనంతరం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేశారు. కంచుపాడు గ్రామంలో సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రాన్ని, సురవరం సుధాకర్ రెడ్డి హాల్, గ్రంథాలయం, క్రీడ, నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగాలను మంత్రులు సందర్శించారు.