
- పంపకాల్లో తేడాతోనే ఫ్యామిలీలో గొడవ: సీతక్క
హైదరాబాద్, వెలుగు: కవిత సస్పెన్షన్.. రాజకీ య డ్రామా అని మంత్రి సీతక్క అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటేనని, భవిష్యత్తులో అందరూ కలిసిపోతారని అన్నారు. బుధవా రం సెక్రటేరియెట్‌లో మీడియాతో సీతక్క చిట్ చాట్ చేశారు. మొదట కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్న కవిత.. ఆ తర్వాత హరీష్ రావు, సంతోష్ రావును లక్ష్యంగా చేసుకున్నారని ఆమె అన్నారు. మళ్లీ ఇప్పుడు కేటీఆర్‌ను వెనకేసుకురావడం ఒక పెద్ద డ్రామా అని పేర్కొన్నారు.
తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్.. తన నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని పరిస్థితికి ఆయన చేరుకున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటపడటంతోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అవినీతి సంపద పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారు. కవిత ఆరోపించినట్లుగా సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వందల కోట్లు సంపాదించారు.
ములుగులో నన్ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిదే కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? కవిత సస్పెన్షన్.. ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ, ఆమెను సస్పెండ్ చేసి సంబురాలు చేసుకోవడం, పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టుకోవడం వింతగా ఉంది” అని సీతక్క అన్నారు.