మహిళలు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి సీతక్క

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి సీతక్క

ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు : మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని, సీఎం రేవంత్​రెడ్డి మహిళలకు అన్నగా అండగా ఉంటున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మంత్రి కలెక్టర్ దివాకర్ తో కలిసి ములుగు మండలం జగ్గన్నపేట, ఇంచర్ల, వెంకటాపూర్ మండలం జవహర్ నగర్, గోవిందరావుపేట మండలాల్లో పర్యటించి గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా రూ.2.34కోట్లతో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెక్ డ్యాముల నిర్మాణంతో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా పశువులకు తాగునీరు దొరుకుతుందని అన్నారు. గ్రామ పంచాయతీల్లో పోస్టల్ ద్వారా చేయూత పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. 100 రోజుల ఈజీఎస్ పనులు పూర్తిచేసిన కూలీలను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్, డీఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​లో చేరిన మాజీ సర్పంచ్​ 

కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి మాజీ సర్పంచ్​ గట్టి బాబుతో పాటు మరో నలుగురు బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరారు. శుక్రవారం ములుగులో మంత్రి సీతక్క వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. దానం నారాయణ, రమేశ్, తేజ, నాగులు కాంగ్రెస్​ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.