
హైదరాబాద్, వెలుగు: కొవిడ్ కాలంలో నిరసన తెలిపినందుకు నమోదైన కేసులో గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ముందు మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పోలీసుల అనుమతి లేకుండా 2021, ఏప్రిల్ 26న ధర్నా నిర్వహించినట్టు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ నిరసనలో మంత్రి సీతక్క, అప్పటి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు మరి కొంతమంది విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
పబ్లిక్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఐపీసీ188, 269, 270 సెక్షన్ల కింద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఆ కేసు విచారణ నాంపల్లి కోర్టులో కొనసాగుతుండగా.. నేటి విచారణకు మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఆమె తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ వాదనలు వినిపించనున్నారు.