పాలమూరుకు నర్సింగ్​ కాలేజీ మంజూరు : మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

పాలమూరుకు నర్సింగ్​ కాలేజీ మంజూరు : మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

వనపర్తి / మహబూబ్​నగర్​,  వెలుగు: శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందినప్పుడే మూఢ విశ్వాసాలు అంతమవుతాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబ్​నగర్​కు  నర్సింగ్​ కాలేజీ మంజూరైందని  మంత్రి వి. శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు.   వనపర్తిలో  సూర్యచంద్ర ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా  స్థాయి సైన్స్ ఫెయిర్ ను  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి నిరంజన్​రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..   విజ్ఞాన శాస్త్రం మరింత అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ ఆలోచనలు పెరగాలని  విద్యార్థులకు మంత్రి సూచించారు.   కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి అవసరమైన అంశాలపై  కొత్తగా ఆలోచించాలని, కొత్త పరిశోధనల వైపు ఆసక్తి చూపాలని చెప్పారు.   జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో   283 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.  ప్రభుత్వం  నుంచి అందే  అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకొని,  ఉన్నత స్థాయికి ఎదగాలని  ఆకాంక్షించారు.ఈ  కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆర్. లోక నాథ్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డీఈఓ  రవీందర్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. 

పాలమూరులో నర్సింగ్​ కాలేజీ..

మహబూబ్​నగర్​కు  నర్సింగ్ కాలేజ్​ మంజూరైం దని ఎక్సైజ్​ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నెలలోనే ప్రారంభించి, డిసెంబర్ నుంచి క్లాసులు ప్రారంభిస్తామని  చెప్పారు.  పాలమూరులోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, నర్సింగ్ కాలేజ్​ ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మితో నర్సింగ్ కాలేజ్​ ప్రారంభంపై శనివారం మంత్రి సమీక్షించారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని  పై ఫ్లోర్​లో  నర్సింగ్ కాలేజ్​ ప్రారంభించాలని ఆదేశించారు. కాలేజీకి   త్వరలోనే పక్కా భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు గతంలోనే భూమిని సేకరించినట్టు గుర్తుచేశారు. మొదటి బ్యాచ్ లో 60 మందితో ప్రారంభం కానున్న ఈ కాలేజ్​లో భవిష్యత్తులో అవసరమైన అన్ని వసతులను కల్పించడంతో పాటు, మరింత మంది చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా నర్సింగ్ పీజీ కళాశాల కూడా తీసుకొస్తామని మంత్రి చెప్పారు.