నిరుద్యోగుల జీవితాలతో ప్రతిపక్షాలు ఆటలాడొద్దని సూచించారు మంత్రి సీతక్క. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తొమ్మిదిన్నరేండ్లుగా నోటిఫికేషన్లు లేక.. నిరుద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని.. అభ్యర్థులే నష్టపోతారన్నారు. పదేండ్లుగా లక్షలు ఖర్చుచేసి కోచింగ్ తీసుకున్నవారు ఆగం అవుతారని సూచించారు. పెంచిన ఏజ్ లిమిట్ కూడా పోతుందన్నారు.
ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు ఇబ్బందులున్నాయన్నారు. ఏళ్ల తరబడి భర్తీలు లేక పలుశాఖల్లో సేవలు ఇబ్బందిగా మారాయన్నారు. అందుకే యుద్ధప్రాతిపదికన నియామకాలు చేపట్టామని చెప్పారు. యువత ఆకాంక్షల మేరకే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు సీతక్క. వాయిదా వేయాలని కొందరు కోరుతున్నా..అందరి ప్రయోజనం కోసం నిర్వహించకతప్పదని చెప్పారు.
ALSO READ | వర్సిటీల్లోని సమస్యలపై సీఎంకు వినతి
ఉద్యోగాల భర్తీ ఇక్కడితో ఆగిపోలేదని..నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీతక్క. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఏటేటా నోటిఫికేషన్లు వస్తాయన్నారు. రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. తొమ్మిదిన్నరేండ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వక.. నిరుద్యోగులకు ఉరిపోసింది మీరే అంటూ ఆరోపించారు. పదేండ్లుగా గ్రూప్-1, ఏడేండ్లుగా డీఎస్సీ ఎందుకివ్వలేదన్నారు సీతక్క. ఉద్యోగాలని నమ్మించి..వాయిదాలు, పేపర్ లీకులతో నిండా ముంచారని మండిపడ్డారు.