రైతులను ముంచింది బీఆర్ఎస్సే: శ్రీధర్ బాబు

రైతులను ముంచింది బీఆర్ఎస్సే: శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని చేయలేదని, తరుగు పేరుతో ధాన్యంలో కోత పెట్టిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలోనే కరువు మొదలైందని, కానీ దాన్ని కాంగ్రెస్​కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్​లో ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్ ఇంట్లో మీడియాతో శ్రీధర్ బాబు మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో క్వింటాల్​కు నాలుగైదు కిలోల తరుగు తీసి రైతులను నిండా ముంచారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు. ఇప్పటికీ రైతులు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రైతులకు తీవ్ర అన్యాయం చేసిన బీఆర్ఎస్​నేతలకు వాళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు” అని అన్నారు. తాము ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు మేలు చేస్తున్నాం.

మార్కెట్లకు తీసుకొచ్చినా, ఐకేపీ సెంటర్లకు తీస్కపోయినా, నేరుగా మిల్లర్లకు అమ్ముకున్నా.. ఒక్క గింజ కూడా తరుగు తీయొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. తరుగు తీస్తున్నారో లేదో రైతుల వద్దకెళ్లి కేటీఆర్​ తెలుసుకుంటే మంచిది’’ అని సూచించారు. ‘‘పోయినేడాది జులై, ఆగస్టులో వర్షాలు సరిగా పడలేదు. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందో కేటీఆర్​చెప్పాలి. వర్షాలు ఎందుకు పడ్తలేవని వరుణ దేవుడిని వాళ్లు ఎందుకు అడగలేకపోయారు” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మిషన్​భగీరథకు రూ.45 వేల కోట్లు ఖర్చు పెట్టినా నీటి కొరత ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టలేదు కాబట్టే నీటి కొరత ఉందన్నారు. ‘‘బీఆర్ఎస్​అస్తవ్యస్తం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. వచ్చిన ప్రతి రూపాయి సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి పేరు వస్తుండడం, లోక్​సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తుందన్న భయంతోనే బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నది. కాంగ్రెస్​ను అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది” అని మండిపడ్డారు. 

పదేండ్ల కాలంలో అందరి ఫోన్లూ ట్యాప్​ చేసిన్రు

ఫోన్​ట్యాపింగ్​తో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతామని శ్రీధర్ బాబు స్పష్టం చే శారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఏ విధంగా ట్యాప్​ చేశారో అందరికీ తెలుస్తూనే ఉన్నదన్నారు. జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్​ చేసి ఉంటారన్నారు. ‘‘పదేండ్ల కాలంలో అందరి ఫోన్లనూ బీఆర్ఎస్​పాలకులు ట్యాప్​ చేశారు. ఈ విషయాన్ని వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇందులో ఎవరెవరున్నారో అన్నీ కాలక్రమంలో తెలుస్తాయి. ప్రస్తుతం దీనిపై విచారణ నడుస్తున్నది. చట్ట ప్రకారం చర్యలుంటాయి” అని తెలిపారు.

ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతున్నారన్న బీఆర్ఎస్​నేతల కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘బీఆర్ఎస్​నేతలు బీజేపీకి బీటీమ్​గా ఉన్నారు. మరి ఇన్నాళ్లూ కేంద్రానికి వాళ్లు డబ్బులు పంపినట్టేనా?” అని కౌంటర్ ఇచ్చారు. తాము డబ్బులతో ఏనాడూ రాజకీయాలు చేయలేదన్నారు.