ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం

ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం

కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమన్నారు మంత్రి తలసాని. అధికారంలో ఉన్నాం కదా అని బీజేపీ నేతలు ఏదైనా మాట్లాడుతమంటే కుదరదన్నారు. కేంద్రమంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడటం సరికాదన్నారు.  దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు పోదాం, ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. గుజరాత్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదన్నారు. కళ్ళుండి చూడలేని కాబోదులు బీజేపీ నాయకులన్నారు.

సీఎం కేసీఆర్ మనసున్న మారాజన్నారు పేదల కష్టాలను చూసి చలించిన సీఎం వారికి ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్ లోని బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 310 ఇళ్లు పేదలకు ఇస్తున్నట్లు తెలిపారు తలసాని. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదన్నారు. అర్హులైనవారు ఎవరైనా మిస్ అయితే వారిని గుర్తించి వారం రోజుల్లో ఇళ్లిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి జరగడం లేదంటూ ఎక్కడి నుంచో వచ్చిన నేతలు అంటున్నారని..వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 24 గంటల కరెంట్, త్రాగునీరు వంటివి కనపడటం లేదా అని ప్రశ్నించారు.