
- మహేశ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్‌ను 9 గంటలు విచారించిన ఈడీ
- హవాలా వ్యాపారులతో సంబంధాలపై ప్రశ్నలు
- ఇయ్యాల, రేపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి విచారణ
- వారం కిందట్నే నోటీసులు
- ఇప్పటికే 11 మందిని ప్రశ్నించిన ఈడీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: చీకోటి ప్రవీణ్ క్యాసినో హవాలా కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ (ఫెమా) యాక్ట్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముళ్లు తలసాని మహేశ్‌యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్‌ను బుధవారం విచారించింది. ఫోన్ కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్స్, ఫ్లైట్ టికెట్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా సుమారు 9 గంటల పాటు ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌ను విచారించింది. ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో జులై నుంచి గత నెల వరకు సుమారు 11 మందిని ఈడీ ప్రశ్నించింది.
తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేంద్ర, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి గత వారం నోటీసులు జారీ చేసింది. ఈడీ ఆదేశాలతో మహేశ్ యాదవ్, ధర్మేంద్ర బుధవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌లో విచారణకు హాజరయ్యారు. ఉదయం11.30 గంటలకు హాజరైన ఇద్దరిని రాత్రి 8 గంటల వరకు ఈడీ స్పెషల్ టీమ్ ప్రశ్నించింది. ఎల్. రమణ, దేవేందర్‌రెడ్డిని గురు, శుక్రవారాల్లో విచారించేందుకు ఏర్పాట్లు చేసింది.
గోవా, నేపాల్, థాయ్‌లాండ్, హాంకాంగ్‌లో చీకోటి ప్రవీణ్ నిర్వహిస్తున్న క్యాసినో బిజినెస్‌పై ఆగస్టులో ఈడీ కేసు నమోదు చేసింది. చీకోటి గ్యాంగ్ ఈ ఏడాది మే 10 నుంచి 13 వరకు క్యాసినో నిర్వహించింది. జూన్‌లో గోవా, నేపాల్‌లోని మోచీ క్రౌన్ హోటల్‌లో ‘వెగాస్ బై బిగ్ డాడీ’పేరుతో స్పెషల్ ఈవెంట్స్ చేపట్టింది. ‘వెగాస్ బై బిగ్‌డాడీ’ క్యాసినో కోసం బాలివుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రమోషన్స్ చేశారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారు. క్యాసినో ప్యాకేజీలో ఎంట్రీ ఫీజ్,ఫ్లైట్ టికెట్లు, అకామిడేషన్ సహా స్పెషల్ ఆఫర్లు ఇచ్చారు. ఈ డబ్బు అంతా హవాలా రూపంలో చేతులు మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ క్యాసినోలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాసినో గెలిచిన వారితో పాటు ఓడిన వారి డబ్బును హవాలా మార్గంలో ఇతర దేశాలకు తరలించారు. మళ్లీ అక్కడి నుంచి ఇండియాకు మనీలాండరింగ్ చేశారు.
హవాలా వ్యాపారులతో సంబంధాలపై ఆరా!
క్యాసినో కేసులో మొత్తం 35 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత నెల వరకు 11 మందిని విచారించారు. జులైలో చీకోటి ప్రవీణ్‌ను విచారించారు. చీకోటి ఇచ్చిన సమాచారంతో సికింద్రాబాద్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్ సంపత్, సికింద్రాబాద్‌కు చెందిన మాధవరెడ్డి ట్రావెల్ ఏజెంట్ సంపత్, హవాలా ఏజెంట్లు గౌరీశంకర్, బాబులాల్ అగర్వాల్‌ను జులై 29న ప్రశ్నించారు. క్యాసినో టూర్స్, విదేశాల్లో మనీలాండరింగ్, హవాలాపై ఆరా తీశారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై వివరాలు సేకరించారు. గుర్తు తెలియని ఫారిన్ అకౌంట్లకు జరిగిన మనీ ట్రాన్స్‌ఫర్లపై కూపీ లాగారు. చీకోటి ప్రవీణ్‌తో ఉన్న వ్యాపార లావాదేవీలు, క్యాసినో పెట్టుబడుల వివరాలను రికార్డ్ చేశారు. చీకోటి ప్రవీణ్‌తో పాటు హైదరాబాద్‌లోని హవాలా వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో తలసాని మహేశ్, తలసాని ధర్మేంద్రను ప్రశ్నించినట్లు తెలిసింది. వీరితో కలిపి బుధవారం వరకు 13 మందిని ఈడీ విచారించింది. ఇదే కేసులో ఏపీ మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
ఈవెంట్స్‌లో 13 మంది సెలబ్రెటీల ప్రచారం
చీకోటి క్యాసినో ఈవెంట్స్ కోసం 13 మంది సెలబ్రెటీలు ప్రచారం చేశారు. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు ప్రమోషన్ వీడియోలు చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ప్రమోషన్ చేసిన వారికి ఇచ్చిన డబ్బు ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యిందనే వివరాలు రాబడుతున్నారు. ఇందుకోసం జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహించిన క్యాసినోలో పాల్గొన్న వారి వివరాలను సేకరించారు. ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి 15 లక్షలు టూర్ ప్యాకేజీలతో క్యాసినో ఈవెంట్స్‌లో హాజరైనట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ఉన్నట్లు బ్యాంక్ డేటాను బట్టి ఈడీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. క్యాసినో టూర్లకు బుక్ చేసుకున్న వారి కోసం రూ. 50 లక్షలతో ఫ్లైట్లు, రూ. 40 లక్షలతో హోటళ్లను చీకోటి గ్యాంగ్ అరేంజ్ చేసినట్లు ఈడీ విచారణలో బయటపడింది.
పక్కా ఆధారాలతో..!
ఐదు నెలలుగా సేకరించిన ఆధారాలతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిని ఈడీ విచారించనుంది. చీకోటితో పాటు ట్రావెల్ ఏజెంట్స్ వద్ద స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా వీరిని ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రికార్డ్ చేసిన 11 మంది స్టేట్‌మెంట్లతో పాటు తలసాని మహేశ్, ధర్మేంద్ర ఇచ్చిన స్టేట్‌మెంట్లతో క్యాసినో కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి. చీకోటితో వ్యాపార లావాదేవీలు కొనసాగించిన రాజకీయ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు హవాలా రూపంలో పెట్టిన ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ వివరాలను రాబట్టనున్నట్లు సమాచారం.
కీలకంగా మారిన చీకోటి కాంటాక్ట్స్‌చిట్టా
హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మంత్రులతో చీకోటి ప్రవీణ్‌కు ఆర్థికలావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చీకోటి క్యాసినో నెట్‌వర్క్‌లో 18 మంది ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, 280 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు చీకోటి క్యాసినో బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. హాంకాంగ్, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, గోవాలో ప్లేయింగ్ కార్డ్స్, క్యాసినో క్లబ్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లు ఆధారాలు రాబట్టారు. గోవా, నేపాల్‌లో క్యాసినో లీగల్ కావడంతో అక్కడే పదుల సంఖ్యలో క్యాసినో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, బినామీల పేర్లతో సెంటర్లు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.