మీ తప్పులను దాచి.. మాపై నిందలా? : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

మీ తప్పులను దాచి.. మాపై నిందలా? : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
  • కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత 
  • కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిపై తుమ్మల ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత ఏర్పడిందని, వాస్తవాలను దాచి రాష్ట్ర ప్రభుత్వంపై నీచమైన ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘ఓవైపు రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం, ఎర్ర సముద్రంలో నౌకాయాన సమస్యల వల్ల యూరియా దిగుమతులు తగ్గాయని కిషన్ రెడ్డి చెబుతూనే.. మరోవైపు తెలంగాణలో యూరియా పక్కదారి పడుతోందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. 

దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి, దిగుమతులు లేకపోవడంతోనే యూరియా కొరత నెలకొంది. ఈ వాస్తవాలను దాచి, కేంద్రం నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదు” అని తుమ్మల మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు కిషన్ రెడ్డిని ఎన్నుకుని కేంద్రమంత్రిని చేశారని, రైతుల యూరియా కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నదని అందులో పేర్కొన్నారు. 

గత ఏడాదిన్నర కాలంలో రైతులు యూరియా కోసం ఎప్పుడూ ఇబ్బంది పడలేదని, ఈసారి కేంద్రం సకాలంలో సరఫరా చేయకపోవడమే సమస్యకు కారణమని స్పష్టం చేశారు. ‘‘కేంద్రం వానాకాలం సాగు కోసం రాష్ట్రానికి  9.80 లక్షల  టన్నుల యూరియా కేటాయించింది. అందులో ఈ నెల 31 నాటికి 8.30 లక్షల టన్నులు సరఫరా కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 5.66 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చింది. దీంతో 2.64 లక్షల టన్నుల కొరత నెలకొంది. ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం ప్రకటించిన 50 వేల టన్నుల యూరియా తక్షణమే సరఫరా అయ్యేలా కిషన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి” అని కోరారు.