హుస్నాబాద్, వెలుగు: తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలపడానికి సీఎం రేవంత్ చేస్తున్న అన్ని ప్రయత్నాలకు మనం అండగా నిలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. హుస్నాబాద్‌లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల విధ్వంస పాలన నుంచి తెలంగాణను వికాస పాలన వైపు తీసుకెళ్లడానికి సీఎం రేవంత్ రెడ్డి అవిశ్రాంతంగా
కృషి చేస్తున్నారని కొనియాడారు. త్వరలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు వన్నె తెచ్చేటట్టుగా ఉంటుందని వివరించారు. వెంటాడి, వేధించి సాధించుకునేటువంటి వ్యక్తి పొన్నం శాసనసభ్యుడిగా రావడం హుస్నాబాద్ ప్రజల అదృష్టం అన్నారు. పొన్నం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను సాకారం చేయడానికి ఇన్చార్జి మంత్రిగా తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఎన్నికలు అయిన తర్వాత సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి ఉత్తర తెలంగాణనే కాదు తెలంగాణ మొత్తాన్ని పచ్చబరిచి వ్యవసాయంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత సీఎం తనకు అప్పగించారన్నారు.
