మేడిగడ్డ బ్యారేజీపై సమాచారం దాయొద్దు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజీపై సమాచారం దాయొద్దు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఎన్డీఎస్ఏ కమిటీకి అన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి.. లేదంటే కఠిన చర్యలు తప్పవు 
  • అధికారులకు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక.. జలసౌధలో కమిటీ సభ్యులతో మీటింగ్ 
  • బ్యారేజీ పనికొస్తదో లేదో తేల్చండి.. వీలైనంత త్వరగా మధ్యంతర 
  • రిపోర్టు ఇవ్వండి.. నిర్మాణ సంస్థ లోపాలుంటే చర్యలు తీసుకుంటమని వెల్లడి 
  • ఇయ్యాల, రేపు మూడు బ్యారేజీలను పరిశీలించనున్న కమిటీ

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీపై ఎలాంటి సమాచారం దాయొద్దని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీపై స్టడీకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన ఎక్స్ పర్ట్ కమిటీకి కావాల్సిన సమాచారం ఇవ్వండి. ఆ కమిటీకి అన్ని డాక్యుమెంట్లు అప్పగించండి. ఎలాంటి చిన్న సమాచారం దాయొద్దు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

బుధవారం జలసౌధలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిటీ చైర్మన్​ చంద్రశేఖర్​అయ్యర్, మంత్రి ఉత్తమ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి, బ్యారేజీ వివరాలను కమిటీకి వివరించారు. సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డపై వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని కోరినట్టు ఆయన తెలిపారు. అవసరమైతే ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని వాడుకుని కచ్చితత్వంతో రిపోర్ట్​ ఇవ్వాలని సూచించినట్టు చెప్పారు. కమిటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 

అసలు మేడిగడ్డ పనికొస్తదో? రాదో.. రిపేర్లు చేస్తే బ్యారేజీ ఉపయోగపడుతుందా? లేదా? అన్నది తేల్చాలని కమిటీని కోరామని పేర్కొన్నారు. ‘‘రిపోర్ట్​కోసం కమిటీ 4 నెలల డెడ్​లైన్​పెట్టింది. అయితే వీలైనంత తొందరగా మధ్యంతర రిపోర్ట్​ఇవ్వాలని కోరాం. ఆ రిపోర్ట్​ఆధారంగా బ్యారేజీకి రిపేర్లు చేసే వీలుంటుందో? లేదో తెలుస్తుంది. వానాకాలంలోపు ప్రాజెక్టుకు రిపేర్లు సాధ్యమైతే రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదని కమిటీకి చెప్పాం” అని వెల్లడించారు. ‘‘నిపుణుల కమిటీ మూడ్రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తుంది. డ్యామేజీకి గల కారణాలను విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. బ్యారేజీని తిరిగి వాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కమిటీని కోరాం” అని తెలిపారు. 

జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తం.. 

బ్యారేజీ కుంగడం వెనుక నిర్మాణ సంస్థ లోపాలు ఏవైనా ఉన్నాయని కమిటీ రిపోర్టులో తేలితే, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ చెప్పారు. ‘‘మేడిగడ్డ నిర్మాణ సంస్థకు రాష్ట్రంలో ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటుంది. కచ్చితంగా రిపేర్ల బాధ్యత నిర్మాణ సంస్థ తీసుకోవాల్సిందే” అని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జ్యుడీషియల్​ఎంక్వైరీకి విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. ‘‘దీనిపై సిట్టింగ్​జడ్జితో విచారణ జరిపించాలనుకున్నా కుదరలేదు. అయితే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్​జడ్జితో జ్యుడీషియల్​ఎంక్వైరీ చేయించే యోచనలో ఉన్నాం” అని వెల్లడించారు. 

పదేండ్లు మోదీ ప్రభుత్వం ఏం చేసింది? 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రధాని మోదీ తమను విమర్శించడమేంటని ఉత్తమ్​ ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘కేసీఆర్​అవినీతిపై విచారణ జరిపించకుండా పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్ల రుణం ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం కాదా?. కాఈర్పొరేషన్ల పేరుతో లోన్లు ఇచ్చింది కేంద్రం కాదా?” అని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్​పాపం ఎంతుందో బీజేపీ పాపం కూడా అంతే ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​రెండూ అలయ్​బలయ్​చేసుకుంటున్నాయని విమర్శించారు. ‘‘తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ ఒక్క నిజం కూడా చెప్పలేదు. పదేండ్ల నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రధానికి గుర్తుకురాలేదా? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే అభివృద్ధి పనుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు.

యూపీఏ హయాంలో రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇస్తే, దాన్ని మోదీ రాగానే రద్దు చేశారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్​ఫ్యాక్టరీ సహా ఎన్నో హామీలను అమలు చేయలేదు” అని మండిపడ్డారు. కాగా, ఎక్స్ పర్ట్ కమిటీ సమావేశంలో ఇరిగేషన్​శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్​సెక్రటరీ ప్రశాంత్​జీవన్​పాటిల్, ఈఎన్సీలు అనిల్​కుమార్, నాగేందర్​ రావు పాల్గొన్నారు.