
యాదాద్రి, వెలుగు: వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో కలెక్టర్లు వేగం పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. యాదాద్రి కలెక్టరేట్లో శనివారం రాత్రి వడ్ల కొనుగోలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్ల కొనుగోలు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ హనుమంతరావు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. భూ సేకరణకు సంబంధించిన సర్వే, నోటీసులు, అవార్డు తదితర అంశాలను పూర్తి చేస్తే పేమెంట్ విషయం తాము స్పీడప్ చేస్తామని తెలిపారు.
బస్వాపురం, గంధమల్ల, బునాదిగాని కాల్వ తదితర ప్రాజెక్టులకు సంబంధించి చెల్లించిన పేమెంట్ వివరాలను తనకు పంపించాలని మంత్రి ఆదేశించారు. ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన బనకచర్లకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనిపై తమ అభ్యంతరాలను ఇప్పటికే తెలిపామన్నారు. కర్నాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును కూడా తమ ప్రభుత్వం అంగీకరించదని స్పష్టంగా చెబుతున్నా.. హరీశ్‌రావు మాత్రం అసత్యాలు, అబద్ధాలు ఆడుతూ తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మీటింగ్‌లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి, తుంగతుర్తి ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, మందుల సామెల్, సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి ఉన్నారు.