
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం ( సెప్టెంబర్ 27 ) సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారి సేవలో పాల్గొని ముక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ వేదపండితులు మంత్రి ఉత్తమ్ కు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా బావిస్తున్నాని అన్నారు ఉత్తమ్.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని.. భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించిన దేవస్థానంవారిని అభినందిస్తున్నానని అన్నారు. తెలుగు ప్రజలందరికి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి ఉత్తమ్.
►ALSO READ | Bathukamma Special: ఏడోరోజు వేపకాయల బతుకమ్మ.. ఆదిపరాశక్తికి ప్రతిరూపం..
ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం (సెప్టెంబర్ 27) శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.