- మంత్రి వాకిటి శ్రీహరి
చిన్నచింతకుంట, వెలుగు: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపి, వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బొల్లారం గ్రామంలో కోయిల్ సాగర్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే జి.మధు సూదన్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మత్స్య శాఖ డీడీ ఖదీర్ అహ్మద్, ఏడీ రాధా రోహిణి, మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతో కలిసి 2.50 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.123 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
రూ.94 కోట్లతో రాష్ట్రంలోని 26 వేల చెరువుల్లో 88 కోట్ల చేప పిల్లలు, రూ.29 కోట్లతో 300 చెరువులలో 10 కోట్ల రొయ్య పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. చేపల పెంపకంపై ఆధారపడిన 5 లక్షల ఫ్యామిలీలకు ఉపాధి కలుగుతుందన్నారు. అభివృద్ధిలో మక్తల్ నియోజకవర్గం తో పాటు దేవరకద్ర నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. గత పాలకులు పదేండ్లు చేప పిల్లల ఉత్పత్తిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. మొట్ట మొదటిసారి ముదిరాజ్ నైన తనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. మత్స్యశాఖకు బడ్జెట్ పెంచాలని అడిగిన వెంటనే రూ.123 కోట్లు చేప పిల్లల ఉత్పత్తికి కేటాయించారని గుర్తు చేశారు.
చెరువుల్లో చేప పిల్లలు వేయడంతో పాటు చేపల సంఖ్య, రకాలు, సైజు, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు, డైరెక్టర్లు, అధికారి పేర్లు, ఫోన్ నంబర్లతో బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా 80 ఎంఎంకు తక్కువ కాకుండా చేప పిల్లలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్డీవో నవీన్, ఏఎంసీ చైర్మన్ కథలప్ప, ఎంపీడీవో శ్రీనివాస రావు, తహసీల్దార్ దీపిక, మున్సిపల్ కమిషనర్ నరేశ్ బాబు పాల్గొన్నారు. అనంతరం దేవరకద్ర మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
