పడమటి అంజన్న జాతరలో.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడండి : మంత్రి వాకిటి శ్రీహరి

పడమటి అంజన్న జాతరలో.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడండి : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: పడమటి అంజనేయస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దని, ప్రతి వంద మందికి ఒక మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. నారాయణపేట జిల్లా మక్తల్​ పట్టణంలో డిసెంబర్ 2 నుంచి జరిగే పడమటి ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా మంత్రి ఏర్పాట్లపై గురువారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 న ఆలయ సమీపంలో పునర్నిర్మించిన పడమటి ఆంజనేయస్వామి కోనేరుకు పూజలు చేసిన అనంతరం ఆ నీటితో మొదట ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేస్తామన్నారు. 

ఆ తర్వాత ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, ఏపీలో ఉన్న కోనేరులను బాగు చేయాలనే సంకల్పంతో కల్పన అనే మహిళ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారని, తానే స్వయంగా తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఇక్కడి కోనేరును శుభ్రం చేయించారని తెలిపారు. కోనేరు పునర్నిర్మాణం కోసం బడ్జెట్  ఆలస్యమైనా తన సొంత ఖర్చుతో బాగు చేయించారన్నారు. 

కోనేరు చుట్టూ ఇండ్లు ఉన్నవారు వారి స్థలాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జాతరకు ప్రాచుర్యం కల్పించేలా ఆర్టీసీ బస్సులకు మక్తల్  జాతర అనే స్టిక్కర్  అంటించాలని సూచించారు. జాతరలో పని చేసే ప్రతి వలంటీర్​కు డ్రెస్ కోడ్  తప్పనిసరిగా ఉండాలన్నారు. బీజేపీ నాయకుడు కొండయ్య, మార్కెట్  కమిటీ చైర్మన్  రాధా లక్ష్మారెడ్డి, ఆలయ ధర్మకర్త రాణేశాచారి, ఈవో కవిత పాల్గొన్నారు.

క్రీడాభివృద్దే లక్ష్యం..

ఊట్కూర్: రాష్ట్రంలో  క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి తోడ్పాటు అందిస్తున్నారని, గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన సౌలతులు కల్పించి రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఊట్కూర్ లో నిర్మించ తలపెట్టిన మినీ స్టేడియం కోసం గురువారం కలెక్టర్  సిక్తా పట్నాయక్ తో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

 అదనంగా స్థలం ఉంటే చూడాలని అధికారులకు సూచించారు.కాగా, ఈ స్థలం అన్యాక్రాంతం అవుతోందని బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ  కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకురాగా, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్డీవో రామచంద్రనాయక్, తహసీల్దార్  చింత రవి, ఎంపీడీవో కిశోర్ కుమార్, సర్వేయర్  జయ శంకర్,ఎంపీవో శ్రీనివాసరావు, పీఆర్  ఏఈ అజయ్ రెడ్డి  పాల్గొన్నారు.